Breaking News

నా కడుపు మంట చల్లారదు: పవన్ కళ్యాణ్


ఇంతకాలం జనసేనాని పవన్‌కళ్యాణ్‌ బిజెపి పట్ల మెతకవైఖరిని ప్రదర్శిస్తున్నాడన్న బాధ కొందరిలో ఉందనే మాట నిజం. నమ్మించి మోసం చేసిన రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బిజెపిలకు ఇందులో పూర్తి బాధ్యత ఉంది. అలాంటప్పుడు పవన్‌ ‘ప్రత్యేకహోదా’ ఉద్యమం తర్వాత దానిని పూర్తి స్థాయిలో తన గళం వినిపించలేకపోతున్నాడనేది వాస్తవం. మరోవైపు పవన్‌తో కలిసి పనిచేసేందుకు బిజెపికి బద్దశత్రువైన ఉభయ కమ్యూనిస్ట్‌లు సిద్దంగా ఉన్నాయి. మరోవైపు పవన్‌ బిజెపి చేతిలో కీలుబొమ్మ అనే విమర్శలు వస్తున్నాయి. ఇలా రెండు విరుద్దమైన భావజాలం కలిగిన వారితో ఏకకాలంలో పవన్‌ కలిసి పనిచేసే అవకాశం ఉండదనేది కూడా నిజం. 

ఇక తాజాగా పవన్‌ బిజెపి పార్టీనే కాదు.. అది చేసిన ఓటు బ్యాంకు రాజకీయాలపై నాడు మౌనం వహించిన తెలుగుదేశం, ఇతర పార్టీలపై కూడా తాజాగా ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. చిన్న రాష్ట్రాలకు తాము అనుకూలం అని చెబుతూనే అతి పెద్ద రాష్ట్రంగా, పాలనకు కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉత్తరప్రదేశ్‌ వంటి రాష్ట్రాన్ని మాత్రం బిజెపి విభజన చేయకుండా విస్మరిస్తోంది. గతంలో యూపీలో అధికారంలో ఉన్న పార్టీలైన బహుజన సమాజ్‌ పార్టీ వంటివి అందరి సమ్మతితో రాష్ట్రాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం విడదీయాలని చెప్పినా బిజెపి మాత్రం ఆ విషయంలో కిక్కురుమనడం లేదు. ఇదే పాయింట్‌ని పవన్‌ తనదైనశైలిలో ప్రశ్నించారు. 

ఉత్తరప్రదేశ్‌ని నాలుగు ముక్కలు చేసే దాకా నా కడుపు మంట చల్లారదు. బిజెపిపై నాకు చెప్పలేనంత కోపంగా ఉంది. ఏపీ నాయకుల్లో ఒకరికి కూడా ధైర్యం లేదు. 1997లో కాకినాడలో జరిగిన పార్టీ సమావేశంలో బిజెపి నాడే ‘ఒక ఓటు-రెండు రాష్ట్రాలు’ అనే నినాదం ఇచ్చినా మన పార్టీలు, నాయకులు దానిని నిలదీయలేకపోయారు. దానికి మౌనంగా ఉండటానికి మన నాయకులకు బుద్ది ఉండద్దా? మీరెవరురా రాష్ట్రాన్ని విడదీయడానికి? అని ఎవరైనా ప్రశ్నించారా? ఉత్తరప్రదేశ్‌ని కూడా అలాగే చీలుస్తారా? అని మనం అడగలేకపోయాం. యూపీని నాలుగు ముక్కలు చేసే వరకు నా కడుపు మంట చల్లారదు.. అని చెప్పారు. నిజంగానే నాడు బిజెపి ఒక ఓటు-రెండు రాష్ట్రాలు అన్నప్పుడు, ఆ తర్వాత ఆ పార్టీ టిడిపితో పొత్తు పెట్టుకున్నప్పుడు ప్రజలు, నాయకులు, ఇతర పార్టీలు మౌనం వహించాయనేది అక్షరసత్యం. 



By November 06, 2018 at 09:46AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43366/pawan-kalyan.html

No comments