Breaking News

‘థగ్స్‌..’ ఇచ్చిన షాక్‌ ఇంతింత కాదయ్యా..!


ఇటీవల ఏదైనా చిత్రం ఘోరపరాజయం పాలైతే వాటి నష్టాలను హీరోలు కూడా భరిస్తూ వస్తున్నారు. ఈ ట్రెండ్‌కి మొదట శ్రీకారం చుట్టింది రజనీకాంత్‌. కానీ అదే చివరకు ఆయన మెడకి చుట్టుకుంది. విపరీతమైన హైప్‌తో, భారీ అంచనాలు, భారీ బడ్జెట్‌ అంటూ వచ్చిన చిత్రాలను బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు భారీ ధరలకు ఎగబడి కొంటారు. దానికి తగ్గట్లుగా థియేటర్ల యజమానులు కూడా వీటిపై ఉన్న హైప్‌ దృష్ట్యా అమాంతం ఎన్నో రెట్లు ఎక్కువ మొత్తాలకు చిత్రాలను తీసుకుంటారు. ఇప్పుడు ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌’ పరిస్థితి అలానే తయారైంది. ఈ చిత్రం బాహుబలిని బీట్‌ చేస్తుందని, ఏకంగా 300కోట్ల రూపాయల బడ్జెట్‌తో తీస్తున్నామని యష్‌రాజ్‌ ఫిల్మ్స్‌ భారీగా హైప్‌ క్రియేట్‌ చేసింది. దానికి తోడు బిగ్‌బి అమితాబ్‌బచ్చన్‌, మిస్టర్‌ పర్‌ఫెక్షనిస్ట్‌ అమీర్‌ఖాన్‌, కత్రినా కైఫ్‌ వంటి హేమాహేమీలు ఇందులో నటించారు. విజయకృష్ణ ఆచార్య దర్శకత్వం వహించాడు. 

కానీ ఈ చిత్రం మొదటి రోజు బాగానే కలెక్షన్లు రాబట్టినా కూడా రెండో రోజు నుంచి అసలు కథ మొదలైంది. థియేటర్లన్నీ ఖాళీ అయ్యాయి. వారం రోజులకి 100కోట్లు మాత్రమే రాబట్టింది. ముక్కుతూ మూలుగుతూ 150కోట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. దీంతో కొన్నవారికి, ఎగ్జిబిటర్లకు 60శాతంకి పైగా నష్టాలు తప్పేట్లు లేదు. దాంతో వారు యష్‌రాజ్‌ ఫిలింస్‌ యాజమాన్యాన్ని మాత్రమే కాకుండా అమీర్‌ఖాన్‌, అమితాబ్‌బచ్చన్‌ వంటి ఇందులో నటించిన స్టార్స్‌ కూడా తమ నష్టాలను భరించాలని డిమాండ్‌ చేస్తున్నారు. దీనిపై స్పందించకుంటే దేశవ్యాప్త ఆందోళనలకు తెరతీస్తామని అంటున్నారు. 

దీపావళి కానుకగా వచ్చిన ఈ చిత్రం ఉత్తరాది వారికి ఎంతో ఇష్టమైన దీపావళి వెలుగులను నింపకుండా తమను కటిక చీకట్లోకి, నష్టాలలోకి నెట్టిందని వాపోతున్నారు. గతంలో ‘జబ్‌ హ్యారీ మెట్‌ సజల్‌, దిల్‌వాలే’ చిత్రాల సమయంలో షారుఖ్‌ఖాన్‌, ‘టార్చిలైట్‌’ చిత్రం సమయంలో సల్మాన్‌ఖాన్‌లు కూడా ఇలాంటి నష్టాలను తెచ్చిన చిత్రాల సమయంలో తమని ఆదుకున్నారని, కాబట్టి అమీర్‌, అమితాబ్‌లు కూడా నష్టాలు పూడ్చేందుకు ముందుకు రావాలని వేడుకుంటున్నారు. మరి ఈ విషయంలో అమీర్‌, అమితాబ్‌లు ఏ విధంగా స్పందిస్తారో వేచిచూడాల్సివుంది...! 



By November 22, 2018 at 01:00PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43600/amitabh-bachchan.html

No comments