Breaking News

‘సర్కార్’పై స్టార్స్ అందరిదీ ఒక్కటే మాట!


సంచలన దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ కాంబినేషన్‌లో ముచ్చటగా మూడోసారి రూపుదిద్దుకున్న చిత్రం ‘సర్కార్’. దీపావళి కానుకగా విడుదలైన ఈ చిత్రం కాంట్రవర్సీకి కేంద్రబిందువుగా మారింది. విజయ్ ఇంతకు ముందు చిత్రం ‘మెర్సల్’ కూడా ఇటువంటి కాంట్రవర్శీతోనే అద్భుతమైన కలెక్షన్లు రాబట్టి టాక్ ఆఫ్ ది కోలీవుడ్‌గా నిలిచింది. ఇప్పుడు ‘సర్కార్’ చుట్టూ కూడా అటువంటి ఛాయలే కనిపిస్తున్నాయి. వివాదం సద్దుమణిగింది. ఎటువంటి సమస్యా లేదు అంటూనే.. మురుగదాస్‌ ఇంటికి పోలీసులు వెళ్లడంతో ఒక్కసారిగా కోలీవుడ్‌లో ప్రకంపనలు బయలుదేరాయి. ఈ సినిమాలో దివంగత జయలలితతో పాటు ఆమె తెచ్చిన సంక్షేమ పథకాలపై విమర్శనాత్మకంగా కొన్ని సీన్లు ఉన్నాయని, వెంటనే వాటిని తొలగించాలని తమిళనాడుకు చెందిన కొందరు రాజకీయ నాయకులు ఈ సినిమాపై కన్నెర్ర చేశారు. ఇదిలా ఉంటే ఇటువంటి సమస్య వచ్చినప్పుడు మాకెందుకులే అని ఊరుకునే విధానం టాలీవుడ్‌లో ఉంది. టాలీవుడ్ స్టార్ హీరోలు ఇటువంటి విషయాలలో చాలా కామ్‌గా ఉంటారు. కానీ, సర్కార్ విషయంలో కోలీవుడ్ స్టార్ హీరోలంతా యూనిటీని ప్రదర్శించడం ముచ్చటేస్తుంది.

ఈ కాంట్రవర్శీ నేపథ్యంలో దర్శకుడు మురుగదాస్‌కు సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్, నడిగర్ సంఘం అధ్యక్షుడు విశాల్, ఇంకా కోలీవుడ్ హీరోలు, హీరోయిన్లు, నటులు మద్ధతుగా నిలబడి అసలు సెన్సార్ అయిన ఈ సినిమాపై ఇటువంటి రాద్ధాంతం ఏమిటని సూటిగానే ప్రశ్నిస్తున్నారు. దీనిపై సూపర్‌స్టార్ రజనీ స్పందిస్తూ.. ‘‘సెన్సార్ బోర్డు ఓసారి ఆమోదం తెలిపిన సినిమాకు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించడం కరెక్ట్ కాదు. థియేటర్ల ముందు ధర్నాకు దిగడం, సినిమా పోస్టర్లను చించివేయడం.. ఇలాంటి చర్యలు ఆమోదయోగ్యం కాదు. ఈ ఘటనలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. సినిమాను సినిమాలాగా చూడండి..’’ అని ట్వీట్ చేశారు.

ఇక దాదాపు తన సినిమాల విషయంలో ఇటువంటి వాటినే ఫేస్ చేసిన  లోకనాయకుడు కమలహాసన్ స్పందిస్తూ.. ‘‘సర్కార్ లాంటి సినిమాల్లో మార్పులు చేయాలని వేధించడం ఈ ప్రభుత్వానికి కొత్తేం కాదు. సర్కార్ సినిమా సెన్సార్ పూర్తిచేసుకునే విడుదలైంది. ప్రజా విమర్శలను తట్టుకోలేని ప్రభుత్వం ఏదో ఒక రోజు కుప్పకూలిపోతుంది. కమర్షియల్ రాజకీయ నాయకులు ఎప్పటికైనా కనుమరుగైపోవాల్సిందే..’’ అంటూ కాస్త ఘాటుగానే విమర్శించారు.

ఇక వీరందరి కంటే ముందు నడిఘర్ సంఘం అధ్యక్షుడు విశాల్ ఈ విషయంపై పోరాటానికి దిగాడు. మురుగదాస్ ఇంట్లోకి పోలీసులు ఎందుకు వెళ్లారని విశాల్ ప్రశ్నించాడు. సెన్సార్ బోర్డు ఆమోదం తెలిపాక, ప్రజలు సినిమాను ఆస్వాదిస్తున్నప్పుడు ఇటువంటి గొడవలు ఎందుకు చేస్తున్నారు. అసలు కోలీవుడ్‌లో ఏం జరుగుతుందో నాకు అర్ధం కావడం లేదు. ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు సినిమాలపై విరుచుకుపడితే.. ఇంక సినిమాలు ఎలా తీయాలి?. ఏ విషయంపై తీయాలి.. అంటూ గట్టిగానే చురకలు వేశాడు విశాల్. ఇలా స్టార్స్ అందరూ సర్కార్‌కు సపోర్ట్‌గా నిలబడటం.. ఇప్పుడు తమిళ సినిమా పరిశ్రమలోనే హాట్ టాపిక్‌గా మారింది.



By November 11, 2018 at 08:47AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43441/vijay.html

No comments