Breaking News

కోడికత్తి ఘటనపై ఉండవల్లి స్పందన బాగుంది!


ఉండవల్లి అరుణ్‌కుమార్‌.. ఏపీలోని రాజకీయ మేధావులలో ఆయన ఒకరు. ఇక ఈయన నాడు ఏపీ సీఎంగా పనిచేసిన వైఎస్‌రాజశేఖర్‌రెడ్డికి ఎంతో ఆప్తుడు. వైఎస్‌ మాట కోసం మీడియా మొఘల్‌ రామోజీరావుని సైతం ఆయన టార్గెట్‌ చేసి, మూడు చెరువుల నీళ్లు తాగించాడు. ఇక కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఈ మాజీ ఎంపీ గత కొంతకాలంగా అంటే రాష్ట్ర విభజన తర్వాత చాలా మౌనంగా ఉంటూ వచ్చారు. ఆ మధ్య పవన్‌ కేంద్రం ఏపీకి ఇచ్చామని చెబుతున్న నిధులు, రాష్ట్రం చాలా తక్కువగా మాత్రమే సాయం చేసిందని చెప్పిన వాటి మీద 'నిజ నిర్దారణ కమిటీ' వేసి అందులో ఉండవల్లికి కీలకస్థానం ఇచ్చాడు. మరి ఈ నిజనిర్ధారణ కమిటీ ఇంకా కేంద్రం ఏపీకి చాలా సాయం చేయాల్సివుందని తీర్మానించింది. కానీ దీనిపై ఇప్పటి వరకు వారు సరైన ఉద్యమం నడపలేకపోయారు. 

మరోవైపు టిడిపి పట్ల కాస్త అనుకూలంగా ఉన్న ఉండవల్లి పవన్‌ కమిటీ తర్వాత పూర్తిగా చంద్రబాబుకి శత్రువుగా మారిపోయాడు. నాటి నుంచి ఆయన బాబుపై భారీ విమర్శలు సంధిస్తున్నాడు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, జగన్‌లకి మంచి ఆప్తుడైన ఉండవల్లి తాజాగా జగన్‌పై దాడి విషయంలో తన వాదన వినిపించాడు. జగన్‌కే కాదు.. వాళ్ల నాన్న రాజశేఖర్‌రెడ్డికి కూడా డ్రామాలంటే నచ్చవు. ఇలా తన చేతిని తాను పొడిపించుకోవడం వల్ల జగన్‌కి ఒరిగేది ఏమీ ఉండదు. అన్ని పార్టీలు ఈ విషయంలో అనవసర రాద్దాంతం చేస్తున్నాయి. మాట్లాడుకోవడానికి రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటన్నింటిని వదిలేసి ఈ దాడి ఘటన మీదనే ఆరోపణలు, ప్రత్యారోపణలు చేస్తూ అసలు సమస్యలను వదిలేయడం సరికాదు. జగన్‌ సభలకు జనాలు బాగానే వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో జగన్‌ తనపై తాను దాడి చేయించుకోవాల్సిన అవసరం లేదు. జగన్‌కి ఏమైనా జరిగి ఉంటే పర్యవసానాలు ఎలా ఉంటాయనే విషయం సీఎం చంద్రబాబునాయుడుకు కూడా బాగా తెలుసు. 

కాబట్టి జగన్‌ని హత్య చేయించే పని చంద్రబాబు చేశాడని అనడం కూడా సరికాదు. జగన్‌పై హత్యాయత్నం జరిగితే చంద్రబాబుకి సంతోషం ఎందుకు ఉంటుంది? కేసు నిజానిజాలను పోలీసులే తేల్చాలి. నిందితుడు శ్రీనివాసరావుకి నార్కో అనాలిసిస్‌ పరీక్షలు చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయి. కాబట్టి ఈ అనవసర రాద్దాంతాన్ని ఆపివేయాలి. అయినా జగన్‌పై హత్యాయత్నం జరిగిన సమయంలో చంద్రబాబు అతిగా స్పందించాడని ఉండవల్లి అభిప్రాయపడ్డాడు. ఇందులో ఉండవల్లి చెప్పిన మాటలన్నీ అక్షరసత్యాలనే చెప్పాలి. 



By November 04, 2018 at 10:20AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43334/undavalli-arun-kumar.html

No comments