Breaking News

తెలుగులో షారూఖ్: ‘హా.. బాగున్నా బాగున్నా’


హిందీ అనేది జాతీయ భాష అని, బాలీవుడ్‌ చిత్రాలే ఇండియన్‌ చిత్రాలనే మాటలకు అర్ధం మారిపోతోంది. ‘బాహుబలి’తో దీనికి బీజం పడి, రాబోయే ‘2.ఓ’తో మరింతగా దక్షిణాది ప్రాంతీయ భాషా చిత్రాలుగా అభివర్ణించే మూవీలు దేశవిదేశాలలో తమ సత్తాచాటుతున్నాయి. దీంతో ఇంతకాలం ప్రాంతీయభాషా చిత్రాలంటే కాస్త చిన్నచూపు ఉన్నబాలీవుడ్‌ ప్రముఖులు కూడా ఇప్పుడు ప్రాంతీయ చిత్రాలపై, మరీ ముఖ్యంగా దక్షిణాదిభాషలపై దృష్టి సారిస్తున్నారు. ముంబైలో తమ చిత్రాలకు ఎంతగా ప్రమోషన్స్‌ నిర్వహిస్తూ ఉన్నారో, హైదరాబాద్‌, చెన్నైలలో కూడా అంతటి ప్రాధాన్యతను ఇస్తున్నారు. 

అమితాబ్‌బచ్చన్‌, అక్షయ్‌కుమార్‌వంటి వారు తెలుగులో నటించేందుకు ఆసక్తి చూపి, నిజం చేస్తూ ఉంటే ఇక హీరోయిన్ల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ‘2.ఓ’లో ప్రతినాయకునిగా నటిస్తున్న అక్షయ్‌కుమార్‌, త్వరలో ‘సై..రా’లో కీలక పాత్రను పోషిస్తోన్న అమితాబ్‌ వంటి వారిలో వస్తున్న మార్పు దీనికి సంకేతం. ఇక అమితాబ్‌, అమీర్‌లు కలిసి నటించిన ‘థగ్స్‌ఆఫ్‌ హిందుస్థాన్‌’ చిత్రం కోసం అమితాబ్‌, అమీర్‌లు తెలుగులో వాయిస్‌ ఇచ్చారు. తాజాగా తన ‘జీరో’ చిత్రం కోసం ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న బాలీవుడ్‌ కింగ్‌ఖాన్‌ షారుఖ్‌ఖాన్‌ తన 52వ జన్మదినోత్సవం సందర్భంగా మీడియాతో ముచ్చటించాడు. మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానం చెప్పిన షారుఖ్‌ హైదరాబాద్‌ విలేకరి ప్రశ్నవేయడానికి లేవగానే ఈ సరదా సంఘటన చోటు చేసుకుంది. 

ఓ మహిళా విలేకరి తాను హైదరాబాద్‌ విలేకరిని అని చెప్పగానే షారుఖ్‌ మాట్లాడుతూ.. ‘నువ్వు హైదరాబాదీవా’ అని ప్రశ్నించాడు. దానికి ఆమె అవును.. మీరు బాగున్నారా అని ప్రశ్నించగా, దానికి షారుఖ్‌ బాగా తెలుగు వచ్చిన వాడిలా.. ‘ఆ..బాగున్నా.. బాగున్నా’ అని సమాధానం చెప్పాడు. ఆ తర్వాత ఆయన ‘ఐయామ్‌ షారుఖ్‌ఖాన్‌’ అనే పదాలను కూడా తెలుగులో చెప్పడానికి ప్రయత్నించడంతో మీడియాతో పాటు అందరు పడిపడి నవ్వారు. మొత్తానికి షారుఖ్‌ తెలుగుకి ఇస్తున్న గౌరవం చూస్తే ప్రతి తెలుగువాడు గర్వించేలా ఉందని చెప్పవచ్చు. 



By November 07, 2018 at 11:10AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43390/shahrukh-khan.html

No comments