రజినీ హెచ్చరిక: నిజంగా అభినందనీయం!
స్టార్స్ హీరోల చిత్రాలు విడుదలైతే చాలు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులు, అభిమానులు కలిసి ఆయా సినిమాలకి మొదట కొన్నిరోజుల పాటు వందల రూపాయల టిక్కెట్లను వేలాది రూపాయలకు అమ్ముకుంటారు. అయినా వీటిని మన స్టార్స్ పట్టించుకోరు. ఎక్కువ బడ్జెట్ అయింది కాబట్టి రేట్లు పెంచి అమ్ముకోవడంలో తప్పులేదని నిర్మాతలు, భారీ రేట్లకు కొనుగోలు చేశామని బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులు వాదిస్తారు. ఇక సదరు హీరో అభిమానులైతే బేనర్లు, కటౌట్లు, ఫెక్ల్సీలు, థియేటర్ల అలంకరణ కోసం భారీగా ఖర్చుపెట్టాం కాబట్టి కొన్నిరోజుల పాటు తాము తమకి నచ్చిన ధరకు బ్లాక్‌లో అమ్ముకుంటామంటారు. కానీ ఇవన్నీ లోపాయికారీగా జరిగిపోయేవే గానీ వీటి తాలూకు ట్యాక్స్ మాత్రం ప్రభుత్వాలకు చేరదు. ఇదో బ్లాక్‌మనీ స్కాం. దీనిపై అందరిలో అవగాహన రావాల్సివుంది.
తాజాగా ఇదే విషయంపై సూపర్‌స్టార్ రజనీకాంత్ తీవ్రంగా స్పందించాడు. ఆయన హీరోగా, అక్షయ్‌కుమార్ విలన్‌గా, లైకా ప్రొడక్షన్స్ బేనర్‌లో, శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘2.ఓ’ చిత్రం ఈనెల 29వ తేదీన తమిళ, తెలుగు, మలయాళ, హిందీతో పాటు పలు దేశ విదేశీ భాషల్లో విడుదలకు సిద్దమవుతోంది. ఈమూవీ రూ.550 కోట్లతో రూపొందింది. కొందరు తాము రజనీ అభిమానులమని చెప్పి రూ.200 ల టిక్కెట్‌ను రెండు వేలు, మూడు వేలు చొప్పున బ్లాక్‌లో అమ్ముతున్నారు. ప్రేక్షకులు మొదటి రోజే చూడాలనే బలహీనతను క్యాష్ చేసుకుంటున్నారు.
దీంతో రజనీ ప్రజాసంఘాల కార్యకర్తలకు, థియేటర్ల యాజమాన్యానికి ఓ హెచ్చరిక జారీ చేశాడు. థియేటర్లలో అభిమానులమని, ప్రజాసంఘాల నాయకులమని గానీ చెప్పి తీసుకున్న టిక్కెట్లను బయటివారికి అమ్మడానికి వీలులేదు. అభిమానుల నుంచి థియేటర్ల యాజమాన్యం ప్రభుత్వం నిర్ణయించిన ధరలకంటే ఎక్కువ వసూలు చేయడానికి వీలు లేదు. దీనిని అతిక్రమించిన అభిమానులు, ప్రజాసంఘాలు, యాజమాన్యాలపై తగు చర్యలు తీసుకుంటానని రజనీ తీవ్రంగా హెచ్చరించడం నిజంగా అభినందనీయం...!
By November 21, 2018 at 11:05AM
No comments