‘మీటూ’ ఉద్యమంపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు!
దేశంలోని ప్రముఖులంతా ‘మీటూ’ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నారు గానీ ఈ ఉద్యమం ద్వారా కేవలం తమకి పడని వారిపై కక్ష్యసాధింపు చర్యలు, బ్లాక్‌మెయిలింగ్‌కి పాల్పడుతున్న సంఘటనలు కూడా ఉన్నాయని పలువురు భావిస్తున్నారు. దీనిపై కూడా బాగా చర్చ సాగుతోంది. నిజాయితీగా ఈ ఉద్యమాన్ని నడపితే మాత్రం మద్దతు ఇస్తామని ఇప్పటికే రజనీకాంత్, కమల్‌హాసన్, ఎ.ఆర్.రెహ్మాన్ వంటి వారు ఓపెన్‌గానే చెప్పారు. ఇక రాధిక నుంచి శరత్‌కుమార్ వరకు అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ కొందరిపై మాత్రం అనుమానాలు బాగానే ఉన్నాయి.
వైరముత్తు, సాజిద్‌ఖాన్ వంటి వారిపై ఏకంగా పలువురు ఆరోపణలు చేస్తుండటంతో వీరిపై అనుమానాలు బలపడుతున్నాయి. కానీ నానాపాటేకర్, అర్జున్ వంటి వారిపై మాత్రం అందరు సదభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. ఇక విషయానికి వస్తే నటి రాధిక సోదరుడు రాధారవి ఓ ప్రొఫెషనల్ పని మీద ఆయన వద్దకు వెళ్లితే అసభ్యంగా ప్రవర్తించాడని ఓ మహిళ ఆరోపించింది. ఈ విషయంపై తాజాగా రాధారవి స్పందించాడు. ‘‘రేసిజం గురించి మాట్లాడటానికి హాలీవుడ్‌లో ప్రారంభమైన ‘మీటూ’ ఉద్యమం మన ఇండియాలో తప్పు దారిలో నడుస్తోంది. కొన్నిరోజులు ఆగితే ‘మీటూ’ అనేది బెదిరింపు ఆయుధంగా మారిపోతుందేమో..! మీటూ అనేది మహిళలకే కాదు.. మగవారికి కూడా ఉంది. ఇలా ఆరోపణలు వస్తున్న తరుణంలో ఎవరు ఎలాంటి వారో మనం అర్ధం చేసుకోవాలి.
నిజాయితీ కలిగిన వ్యక్తులకు ఇబ్బంది కలగకుండా చూడాలి. మేము అజ్ఞాతంలో ఉండి పేరు చెప్పకుండానే మగవారి పేర్లు బయటపెడతాం అన్నది సరైన పద్దతి కాదు. తప్పు జరిగితే వెంటనే బయటకు చెప్పాలి. 15ఏళ్ల కిందట జరిగింది అని చెప్పడంలో అర్ధం లేదు. ఉద్యమం నిజమైతే నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. కానీ ‘మీటూ’ ఉద్యమం నమ్మేలా లేదు. అందుకే ఈ ఉద్యమానికి నేను సపోర్ట్ చేయడం లేదు అని చెప్పుకొచ్చాడు. ఇక్కడ రాధారవి చెప్పిన మాటల్లో కూడా వాస్తవం ఉందనే అనిపించకమానదు.
By November 08, 2018 at 02:34PM
No comments