పవన్ ఉద్వేగాన్ని ఆపుకోలేకపోతున్నాడు..!
సాధారణంగా ఒకటికి రెండు చోట్ల పోటీ చేయడం మన రాజకీయ నాయకులకు అలవాటే. కానీ అది అంత మంచి పద్దతి కాదు. కేవలం గెలుపుపై నమ్మకం లేకనే అలా పోటీ చేసి, ఎక్కడో ఒక చోట గెలుస్తామనే ఉద్దేశ్యంతోనే అలా చేస్తుంటారనే విమర్శలు కూడా ఉన్నాయి. అయితే రెండు చోట్ల గెలిస్తే ఒక సీటుకి రాజీనామా వల్ల మరలా ఉప ఎన్నికలు అనివార్యం అవుతాయి. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ సమయంలో కూడా ఇలా రెండు చోట్ల పోటీ చేసి ఓ చోట గెలిచి, మరోచోట ఓటమి పాలయ్యాడు. ఇప్పుడు జనసేనాని పవన్‌కళ్యాణ్ కూడా అలాంటి ఆలోచనతోనే ఉన్నాడని అర్ధం అవుతోంది. ఆయన మొట్టమొదటి సారి అనంతపురం జిల్లాలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని, తాను అనంతపురం జిల్లాను దత్తత తీసుకుంటానని ఎంతో ధైర్యంగా ప్రకటించాడు. కానీ అదేమి విచిత్రమో గానీ ఆయన ఏ ప్రాంతంలో ప్రచారం చేస్తే ఆయా స్థానికులకు ఊరటనిచ్చే విధంగా తనకు ఇక్కడి నుంచే పోటీ చేయాలని ఉంటోందని అంటున్నాడు.
తాజాగా ఆయన పిఠాపురంలో మాట్లాడుతూ, తనకి పిఠాపురం నుంచి పోటీ చేయాలని విజ్ఞప్తులు వస్తున్నాయని, శ్రీపాద వల్లభుడి ఆశీస్సులు ఉంటే పిఠాపురం నుంచి పోటీ చేస్తానేమో అని మరో బాణం వదిలాడు. తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, పై వ్యాఖ్యలు చేశాడు. వచ్చే ఎన్నికల్లో నన్ను పిఠాపురం నుంచి పోటీ చేయమని పలువురు అడుగుతున్నారు. ఇక్కడి నుంచే పోటీ చేయమని ఇక్కడి మత్స్యకారులు అడుగుతూ ఉంటే ఇక్కడి ప్రత్యేకత ఏమిటో నాకు మొదట అర్ధం కాలేదు. ఆ తర్వాత శ్రీపాద వల్లభుని నేల ఇదేనని నాకు అర్ధమైంది. పిఠాపురం నుంచి పోటీ చేయాలనేదే దేవుడి ఆజ్ఞ అయితే అప్పుడు చూద్దాం. అసెంబ్లీ ఎన్నికల్లో నేను ఎక్కడి నుంచి పోటీ చేయాలనే నిర్ణయం నాది కాదు. సెలక్షన్ కమిటీ ఈ విషయం నిర్ణయిస్తుంది.
వచ్చే ఎన్నికల్లో నన్ను తిరుపతి, అనంతపురం, ఇచ్చాపురం నుంచి కూడా పోటీ చేయమని అక్కడి ప్రజలు అడుగుతున్నారు. ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయం ఇంకా ఆలోచించలేదు.. అని చెప్పుకొచ్చాడు. విజ్ఞప్తులు అనేవి ప్రతి ప్రాంతం నుంచి వస్తాయి. అంతే గానీ శ్రీపాద వల్లభునిలా పవన్ ఏమీ సర్వాంతర్యామి కాదు. కాబట్టి ఏ ప్రాంతానికి వెళ్లినప్పుడు అక్కడి వారిని తాత్కాలిక తృప్తి కోసం ఆయన ఇలా హామీలు ఇచ్చుకుంటూ పోతే చివరకు అదే ఆయనకు మైనస్ అయినా ఆశ్చర్యం లేదని చెప్పాలి.
By November 08, 2018 at 01:22PM
No comments