Breaking News

ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్‌లపై బాబు స్కెచ్ ఇదేనా?


సాధారణంగా సినీ గ్లామర్‌ని.. పార్టీకి, అధికారానికి ఉపయోగించుకోవాలనే వ్యక్తుల్లో ఏపీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ముందుంటారు. ఆయన ప్రతి ఎన్నికలలోనూ ఎవరో ఒక స్టార్‌ని తన పంచన చేర్చుకుంటూ ఉంటాడు. ఈ కోవలోకి బాలకృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌, హరికృష్ణ, పవన్‌కళ్యాణ్‌ వంటి వారు ఎందరో ఉన్నారు. ఇక ఒకనాడు జూనియర్‌ని, హరికృష్ణని బాగా వాడుకుని అసలు విషయానికి వచ్చే సరికి కూరలో కరివేపాకులా తీసివేశాడనే చెడ్డపేరు ఆయనకు ఉంది. ఇక కిందటి ఎన్నికల్లో ఆయన అటు బాలయ్యని, ఇటు పవన్‌ని కూడా లైన్లో పెట్టాడు. కానీ ఇప్పుడు పవన్‌.. చంద్రబాబు అంటే మండిపడుతున్నాడు. 

సో.. వచ్చే ఎన్నికల్లో మరలా నందమూరి ఫ్యామిలీ హీరోలపై బాబు కన్నుపడిందని అంటున్నారు. దానికి హరికృష్ణ మరణం కూడా ఓ వేదికగా మారింది. ఇక బాలయ్య విషయంలో చంద్రబాబుకి ఎలాంటి ఢోకా లేదు. ఎందుకంటే తన వారసునిగా నారాలోకేష్‌ని ఆయన ముందుకు తీసుకుని వచ్చినా అతను బాలయ్యకి ముద్దుల అల్లుడు కాబట్టి బాలయ్య కాదనలేడు. మంత్రి పదవి వస్తే కాదనను అని చెప్పినా బాలయ్యకు బాబు మంత్రి పదవి ఇవ్వలేదు. కానీ బాలయ్య ఈ విషయాన్ని కూడా బాగా లైట్‌గా తీసుకున్నాడు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో ఆయన తన అన్నయ్య హరికృష్ణకి వారసులుగా జూనియర్‌ ఎన్టీఆర్‌, నందమూరి కళ్యాణ్‌రామ్‌లను రాజకీయాలలోకి తీసుకువస్తాడా? అనే చర్చ జోరున సాగుతోంది. ఎన్టీఆర్‌ కెరీర్‌ పీక్‌ స్టేజీలో ఉంది కాబట్టి ఆయన రాజకీయాలలోకి వచ్చే అవకాశాలు తక్కువే. 

అయితే ఇటీవల కళ్యాణ్‌రామ్‌-జూనియర్‌ ఎన్టీఆర్‌ల మద్య మంచి సాన్నిహిత్యం పెరిగింది. సో.. హరికృష్ణ వారసునిగా సినిమాలలో హీరోగా పెద్దగా సక్సెస్‌ కాలేకపోతున్న నందమూరి కళ్యాణ్‌రామ్‌ చేత పొలిటికల్‌ అరంగేట్రం చేయిస్తే దానికి ఎన్టీఆర్‌ మద్దతు కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఆ కోణంలో ఆలోచిస్తున్న బాబు వచ్చే ఎన్నికల్లో కళ్యాణ్‌రామ్‌కి ఎమ్మెల్యే సీటు ఇస్తాడని ప్రచారం సాగుతోంది. మరి ఈ విషయంపై క్లారిటీ రావాలంటే కొంత కాలం వేచిచూడాల్సిందే..! ఈ లెక్కన చూస్తే బాబు ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనే నానుడిని మరోసారి నిజం చేసే అవకాశాలే కనిపిస్తున్నాయి. 



By November 07, 2018 at 05:18AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43382/chandrababu-naidu.html

No comments