విశాల్ వీక్‌నెస్‌ని బయటపెట్టిన మహానటి!
మలయాళ కుట్టిగా అతి పిన్నవయసులోనే, అతి తక్కువ చిత్రాలతోనే నటనాసత్తాపరంగా తన స్టామినా ఏమిటో నిరూపించుకున్న నటి కీర్తిసురేష్. ఈమె 2013లో విక్రమ్ ప్రభు జంటగా ‘ఇదు ఎన్నమాయం’ చిత్రంతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అతితక్కువ వయసులోనే విజయ్, విశాల్, విక్రమ్, ధనుష్, శివకార్తికేయన్ వంటి కోలీవుడ్ స్టార్స్‌తో పాటు పవన్‌కళ్యాణ్ వంటి టాలీవుడ్ టాప్‌స్టార్‌తో కూడా జతకట్టింది. తెలుగు, తమిళ, మలయాళీ భాషల్లో దూసుకుపోతోన్న ఈమె ‘భైరవ’ చిత్రం తర్వాత అతి తక్కువ సమయంలోనే కోలీవుడ్ టాప్‌స్టార్ విజయ్ సరసన రెండోసారి ‘సర్కార్’లో జోడీకడుతోంది. ఈ చిత్రం దీపావళి కానుకగా ఈనెల 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘అజిత్ సార్‌తో కూడా నటించాలని ఉంది. అది కూడా త్వరలోనే నెరవేరుతుందని ఆశిస్తున్నాను. అజిత్‌గారితో నటించడం కోసమే ఎదురు చూస్తున్నాను. ‘మహానటి’ చిత్రం నా కెరీర్‌లో మరపురాని చిత్రం. అలాంటి అవకాశం ఎప్పుడో జీవితకాలంలో ఒకసారి మాత్రమే వస్తుంది. అలాంటి అవకాశం రావడం కూడా ఎంతో కష్టం. అది నా విషయంలో నిజం అయినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇక నటి కావడం వల్ల వ్యక్తిగత జీవితంలో స్వేచ్ఛను కోల్పోయానని ఎన్నోసార్లు బాధపడిన సందర్భాలున్నాయి. అయితే ప్రైవసీ కోసం స్వేచ్ఛగా బయట తిరగాలని కోరుకుంటే మాత్రం నటి అనే ఈ కీర్తిని పొందలేను కదా! అనిపిస్తుంది.
మనం అనుకున్నవన్నీ జరిగితే జీవితం అనేదానికి అర్ధమే ఉండదు. ఒకటి కావాలంటే మరోదాన్ని కోల్పోవాల్సిందేనని అర్ధం చేసుకున్నాను. అయితే ఇప్పుడు కూడా ముఖానికి దుప్పెట కప్పుకుంటే బయటి ప్రపంచానికి తెలియదుకదా! అలా నేను కూడా చాలా సార్లు ఇలాగే షాపింగ్ చేశాను. ఎంతో థ్రిల్లింగ్‌గా అనిపించింది. డ్యాన్స్, పాడటం కూడా కొద్దిగా నేర్చుకున్నాను. అయితే నేను పెద్ద గాయనినికాదు. బాత్రూం గాయనినే. ఇప్పుడు ఎవరైనా పాడొచ్చు అన్నట్లుగా ఉంది కాబట్టే గాయనిగా మారాను. నేను రాసిన కథను అక్క దర్శకత్వంలో నాన్న నిర్మించాలని, అందులో అమ్మమ్మ, అమ్మ, నేను కలిసి నటించాలని ఉంది. మరో విశేషం ఏమిటంటే నేను రాసిన కథకు కథనం, మాటలు అందిస్తానని దర్శకుడు లింగుస్వామి నాకు మాటిచ్చారు.
విశాల్‌ని నేను ఎప్పుడు చూసినా చేతిలో ఫోన్‌తోనే ఉంటాడు. ఆయనకు మరో చేయి ఉంటే అందులో కూడా సెల్‌ఫోనే ఉంటుందనిపిస్తుంది. ఆయన అలానే సెట్‌లోకి వస్తారు. ఆయన ఎంతో ఫ్రెండ్లీగా ఉంటారు. నటిని కాకముందు నేను కూడా అందరిలాగానే విజయ్‌సార్ సినిమాలను చూస్తూ ఆనందించాను. అదే ఇప్పుడు ఆయనకు జంటగా రెండు చిత్రాలలో నటించాను. విజయ్‌ని తెరమీద చూసి చప్పట్లు కొడుతూ, ఈలలు వేసిన నేనేనా ఆయనతో కలిసి నటించింది? అని ఒక్కోసారి నమ్మశక్యం కానంతగా ఆశ్చర్యపోతుంటాను. ‘సర్కార్’ చిత్రం విజయ్ అభిమానులకే కాదు.. నాకు కూడా అందుకే డబుల్ ధమాకా చిత్రం అంటూ తనలోని భావాలను ‘మహానటి’ చెప్పుకొచ్చింది.
By November 04, 2018 at 03:29AM
No comments