Breaking News

అందుకే.. పంది పిల్లని ఎంచుకున్నా: రవిబాబు!


నటునిగా 75 చిత్రాలకు పైగా నటించి, దర్శకునిగా 13వ చిత్రమైన ‘అదుగో’ చిత్రం ద్వారా రవిబాబు మరోసారి ప్రేక్షకులను పలకరించాడు. ఈ చిత్రంలో ఓ పందిపిల్ల ప్రధానపాత్ర పోషించింది. దీంతో ఈ చిత్రంపై కొత్తదనం కోరే అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. ఇక ఇందులో పందిపిల్లను ప్రధానపాత్రకి ఎంచుకోవడానికి గల కారణాలను రవిబాబు ఇలా తెలిపారు. విజువల్‌ ఎఫెక్ట్స్‌ వల్లనే ఈ చిత్రం ఆలస్యమైంది. పందిపిల్ల అనేది త్రీడీ ఆబ్జెక్ట్‌. అంటే పందిపిల్లని త్రీడీ యానిమేషన్‌లో సృష్టించి, దానిని సినిమాలో పెట్టి, నిజమైన జంతువు అని నమ్మించాలి. అలా సృష్టించడానికి మన వద్ద సాంకేతికత తక్కువగా ఉంది. అదే సమయంలో పందిపిల్లతో మొదటి సారి నేను చిత్రం చేస్తున్నాను. మనం కూడా చేస్తూ నేర్చుకోవడమే. ఈ సినిమా చూసిన తర్వాత అందరు ఇందులో ఎక్కడ విజువల్‌ఎఫెక్ట్స్‌ లేవే అని అడుగుతారు. విజువల్‌ ఎఫెక్ట్స్‌ అంటే ప్రత్యేకంగా అనిపించకూడదు. ఎవ్వరూ గుర్తుపట్టనంత నేచురల్‌గా ఉండాలి.విజువల్‌ ఎఫెక్ట్స్‌కి ఉన్న గొప్పలక్షణం అదే. సినిమా చూసిన తర్వాత ఇదంతా గ్రాఫిక్స్‌ మాయ అని కాకుండా నిజమేనని నమ్మాలి. అలా నమ్మించడం కోసమే ఇంత సమయం పట్టింది. 

ఒక్క పంది పిల్ల కోసం 150 పందిపిల్లలని పెంచాను. పందిపిల్లతో సినిమా అంటే ముందు నాకు పంది పిల్లల గురించి పూర్తిగా అర్ధం కావాలి. పంది పిల్లతో సినిమా తీయడం మనదేశంలో ఇదే తొలిసారి. చీమ, ఈగ, కందిరీగ, ఏనుగు, సింహం, గొరిల్లా వంటి వాటితో చిత్రాలు వచ్చాయి. మిగిలింది పందిపిల్లే అనిపించింది. దాంతోనే ఈ చిత్రం చేయాలని నిర్ణయించుకున్నాను. పెప్పా పిగ్‌, త్రీ లిటిల్‌ పిగ్స్‌ వంటి కార్టూన్‌ షోలు జనాలు బాగా చూసేవారు. చిన్నపిల్లలు బాగా ఎక్కువగా ఆస్వాదించేవారు. పందిపిల్లకి ఎంత అభిమాన గణం ఉందో అప్పుడు తెలిసింది. విజువల్‌ ఎఫెక్ట్స్‌, యానిమేషన్‌కి ప్రాధాన్యం ఉన్న చిత్రమే అయినా సినిమా షూటింగ్‌లో నిజమైన పందిపిల్ల ఉండాలి. తీసే సన్నివేశంలో నిజమైన పందిపిల్లను పెట్టి దాని హావభావాలు ఎలా ఉంటాయో పరిశీలించాలి. 

సినిమా పూర్తయ్యే లోపు మాకు ఏకంగా 150 పందిపిల్లలు కావాల్సివచ్చాయి. హైదరాబాద్‌లోని మూడు పందిపిల్లల ఫామ్‌లను గుర్తించి, వాటి నుంచి కొత్త బ్రీడ్‌ ఉత్పత్తి చేయించి, అవి పుట్టిన తర్వాత తీసుకుని వచ్చి 150 పందిపిల్లలను పెంచాను. పందిపిల్ల అంటే ఎవరైనా చిరాకు పడతారు. లేకపోతే తింటే బాగుంటుంది అంటారు. ఇందులో పంది పిల్ల ఎంతో క్యూట్‌గా ఉంటుంది. దాంతో ఈ సినిమా చూస్తే అందరికీ పందిపిల్లపై ఉండే అభిప్రాయం మారిపోతుంది.. అని చెప్పుకొచ్చాడు. 



By November 08, 2018 at 02:18PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43403/director-ravibabu.html

No comments