కేటీఆర్ అసహనం నుంచి ఈ మాటలు వచ్చాయా?
ప్రస్తుతం దేశవ్యాప్త మీడియా, ప్రజల చూపు మొత్తం బద్దశత్రువులైన టిడిపి-కాంగ్రెస్‌ల కలయిక మీదనే ఉంది. ఎన్టీఆర్ కాంగ్రెస్‌కి ప్రత్యామ్నాయంగా స్థాపించిన మాట నిజమే. కానీ కాంగ్రెస్‌లోని ఢిల్లీ పెద్దల తీరు, వారు ఇష్టం వచ్చినట్లుగా రాష్ట్రంలో ముఖ్యమంత్రులను ఎన్నిక చేస్తూ ఉండటం, రాష్ట్రానికి సీఎంలను తమ కింద పనిచేసే జాగీర్లుగా భావించడం వంటివి ఎన్టీఆర్ సహించలేకపోయాడు. దాంతో ఆయన తెలుగు వారి ఆత్మగౌరవ నినాదాన్ని ఎంచుకుని సత్తా చాటాడు. అదే సమయంలో ఆయన పదవీచ్యుతుడు అయిన తర్వాత రాష్ట్రం కోసం తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ సహా ఏ పార్టీతోనైనా నడిచేందుకు సిద్దమయ్యారని కూడా ఆయన మరణం ముందు వార్తలు వచ్చాయి. తెలుగువారి ఆత్మగౌరవం అంటే అది కేవలం కాంగ్రెస్ మాత్రమే దెబ్బతీయలేదు. ఇప్పుడు బిజెపి అంత కంటే ఏపీని చులకనగా చూస్తోంది. ఎన్టీఆర్‌ని దింపి నాదెండ్ల భాస్కర్‌రావు సీఎం అయినప్పుడు ప్రజలే ప్రజాస్వామ్య పరిరక్షణకు నడుం కట్టారు.
కానీ ఎన్టీఆర్ నుంచి బాబు ముఖ్యమంత్రి పీఠం నుంచి తొలగించాక కూడా ప్రజలు చంద్రబాబుకే మద్దతు పలికారు. కాబట్టి రాజకీయ నాయకులలాగానే పార్టీల సిద్దాంతాలు కూడా కాలక్రమేణ మారిపోతూ ఉంటాయి. కాంగ్రెస్, వామపక్షాలు, బిజెపి, వామపక్షాలు కూడా కొన్నిసార్లు పరస్పర చేయూతలను అందించుకున్నాయి. కాబట్టి రాజకీయాలలో ఎవరు శాశ్వత శత్రువు కాదు.. ఎవ్వరూ శాశ్వత మిత్రులు ఉండరనేది అర్ధమవుతోంది. గతంలో కాంగ్రెస్, టిడిపిలతో కూడా కేసీఆర్ పొత్తులు పెట్టుకున్నాడు. ఇక కేసీఆర్ మోదీకి అనుకూలం అనే విషయం పలువురిలో ఉంది. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పెట్టాలని ఆశించినా ఆయనను ఎవ్వరూ పెద్దగా నమ్మలేదు. అదే చంద్రబాబు బిజెపి వ్యతిరేక కూటమికి సిద్దమైన వెంటనే దాదాపు 15కి పైగా పార్టీలు, చివరకు డిఎంకే స్టాలిన్ కూడా మద్దతు ఇచ్చాడు.
ఇక తాజాగా చంద్రబాబుపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశంగా మారాయి. ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు మాటలను ప్రతిధ్వనించేట్లు చేయడం తప్ప మరేమీ కామెంట్ చేయబోను.. అంటూ గతంలో చంద్రబాబు చేసిన కొన్ని ట్వీట్ల స్క్రీన్‌షాట్లను ఆయన పోస్ట్ చేశారు. 'అవినీతి కాంగ్రెస్ నుంచి దేశానికి స్వాతంత్య్రం తేవడమే నా లక్ష్యం. అందుకోసం ఏమైనా చేస్తాను. రాహుల్‌ని ప్రధానిని చేయాలనే ఉద్దేశ్యంతో సోనియా వ్యక్తిగత అజెండాతో దేశ భవిష్యత్తుని ప్రమాదంలోకి నెడుతున్నారు. ఏపీ కాంగ్రెస్ పెద్దలు సోనియా కాళ్ల మీద పడి పోయారు. ఇప్పుడు మరలా 1983 రిపీట్ అవుతుంది. కాంగ్రెస్ తుడిచి పెట్టుకుపోతుంది. అవినీతితో నిండిపోయిన కాంగ్రెస్‌కి ప్రజలు గుణపాఠం చెప్పారు. ఎన్డీయేకి ఓట్లేసిన అందరికీ ధన్యవాదాలు' అంటూ బాబు చేసిన ట్వీట్లను ఎంతో తెలివిగా కేటీఆర్ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
By November 04, 2018 at 11:46AM
No comments