కోడి కత్తి.. టీడీపీపై జరిగి ఉంటేనా??: పృథ్వీ!
వైసీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నాయకుడు జగన్‌పై జరిగిన కోడి కత్తి ఘటనను అన్ని పార్టీలు రాజకీయంగా బాగా వాడుకుంటున్నాయి. ఒకవైపు పూర్వాపరాలు ఆలోచించి, విచారణలో నిగ్గుతేలకుండానే స్వయంగా ఏపీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు తన స్థాయిని తగ్గించుకుని ఈ ఘటనను జగనే చేయించుకున్నాడని, సింపతీ కోసమే ఆయన అలా చేశాడని మాట్లాడటం తప్పు. అయితే ఇది జరిగిన క్షణాలలోనే ఇంకా జగన్ కూడా స్పందించకముందే వైసీపీ కూడా చేయని డిమాండ్‌ని బిజెపి నేతలైన కన్నాలక్ష్మీనారాయణ, జీవీఎల్ వంటి వారు చేశారు. ఏకంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయి కాబట్టి వెంటనే ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేయడం కూడా సబబు కాదు. మరి రాష్ట్రపతి పాలనలో కూడా ఇలాంటి ఘటనే జరిగితే రాష్ట్రపతిని కూడా తొలగించి ఐక్యరాజ్య సమితి పాలన పెడతారా? అనేది వారికే తెలియాలి. రాజ్యాంగ సంక్షోభం ఏర్పడితే గానీ రాష్ట్రపతి పాలన విధించకూడదని, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలను రద్దు చేయరాదని గతంలో కాంగ్రెస్ హయాంలో ప్రజాస్వామ్య పరిరక్షణ దారులమని చెప్పుకునే బిజెపి నేతలే విమర్శించారు.
మరోపక్క జగన్ మాత్రం ఎంతో కీలకమైన తన గాయమైన చొక్కాను ఇవ్వకుండా రాష్ట్రంలోని వ్యవస్థలపై తనకు నమ్మకం లేదని, కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలని కోరాడు. అంటే ఆయన అన్యాపదేశంగా సిబిఐ విచారణ కోరాడు. కానీ ఇదే జగన్ తనపై అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు సిబిఐపై తనకు నమ్మకం లేదన్నాడు. మరోవైపు జగన్‌పై దాడి జరిగిన విధంగానే తనపై కూడా దాడులు జరగబోయాయని పవన్ కూడా దీనిని రాజకీయం చేసే ప్రయత్నం చేశాడు. ఇక తాజాగా వైసీపీ పార్టీలో చేరిన 30ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ.. ఏపీలోని టిడిపి ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఓ ప్రతిపక్ష నేతపై దాడి జరిగినా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. జగన్‌పై దాడి ఘటన చాలా దురదృష్టకరం. ఓ సినిమా షూటింగ్ కోసం బ్యాంకాక్ వెళ్లినందునే దీనిపై నేను వెంటనే స్పందించలేకపోయాను. ఈ దాడికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేదని, ఘటన జరిగిన ప్రదేశం కేంద్ర పరిధిలోకి వస్తుందని ఏపీ ప్రభుత్వం చెప్పడం సరికాదు.
ప్రతిపక్ష నేతపై దాడి జరిగితే ప్రెస్‌మీట్ పెట్టి అధికార పార్టీ నాయకులు నవ్వుతూ అవహేళన చేశారు. ఇదే దాడి టిడిపి నాయకులపై జరిగి ఉంటే ఈ పాటికి గుడ్డలు చించుకుని, రోడ్లపైకి వచ్చి ఇది ప్రజాస్వామ్యానికి జరిగిన అవమానం అని గోలగోల చేసేవారు. ధర్మపోరాట సభలని, మరోటని ఏవేవో సభలు పెడుతున్నారు కదా..! అలాంటి సభలే పెట్టి కొంగజపాలు చేస్తూ రాష్ట్రానికి ఏదో అన్యాయం జరగినట్లు హడావుడి చేసేవారు అని వ్యాఖ్యానించాడు. మరోవైపు ఇంతకు ముందే పృథ్వీ మీద ఆయన భార్య కేసులు పెట్టింది. ఇలా పృథ్వీ వంటి వారు ఏదో రాజకీయం గురించి మాట్లాడటం హాస్యాస్పదం, నంద్యాల ఎన్నికల్లో వేణుమాధవ్ ‘బట్టేబాజ్’ అన్న తరహాలనే పృథ్వీ వ్యాఖ్యలు ఉన్నాయి. ఇలాంటి వారిని పెంచి పోషిస్తోన్న టిడిపి, వైసీపీ వంటి పార్టీలను చూస్తే మన నాయకులు ఇలాగే ఉంటారేమో అనిపించకమానదు.
By November 09, 2018 at 06:48AM
No comments