Breaking News

కృష్ణవంశీ చివరకి ఇలా డిసైడ్ అయ్యాడు


తెలుగులో క్రియేటివ్‌ దర్శకుడు అంటే కృష్ణవంశీ పేరు వినిపిస్తుంది. నాటి వంశీకి తగిన వారసునిగా ఈయనను కొందరు చిన్న వంశీ అని కూడా పిలుస్తారు. కానీ ఆయనను అలా పిలవడం ఆయనకు అసలు ఏమాత్రం ఇష్టం ఉండదు. వర్మ శిష్యునిగా ‘గులాబి’తో దర్శకుడైన కృష్ణవంశీ నుంచి ‘నిన్నే పెళ్లాడతా, ఖడ్గం, మురారి, అంత:పురం, సింధూరం, సముద్రం’ వంటి గొప్ప చిత్రాలు వచ్చాయి. అనుకున్న స్థాయిలో ఆడకపోయినా కూడా ‘శ్రీఆంజనేయం, చక్రం, డేంజర్‌’ వంటి చిత్రాలు మంచి పేరునే సాధించాయి. ఇక ఆయనకు చివరగా వచ్చిన విజయం 2007లో వచ్చిన ‘చందమామ’. కానీ ఆ తర్వాత ‘శశిరేఖాపరిణయం, మహాత్మ, మొగుడు, పైసా, గోవిందుడు అందరి వాడేలే, నక్షత్రం’ ఇలా ఏదీ సరిగా ఆడలేదు. సరికదా.. రామ్‌చరణ్‌ వంటి హీరో ‘గోవిందుడు అందరి వాడేలే’తో సువర్ణావకాశం ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. 

‘పైసా, మొగుడు, నక్షత్రం’ వంటి పలు చిత్రాలు విడుదలకే నానాతంటాలు పడ్డాయి. ఇక బాలయ్య నమ్మి ‘రైతు’ చేద్దామని చూసినా బిగ్‌బి అమితాబ్‌ని కీలకపాత్ర కోసం ఒప్పించడంలో విఫలమై అవకాశాన్ని చేజార్చుకున్నాడు. దీంతో ఇక సొంత కథలపై నమ్మకం వదిలేశాడో ఏమో గానీ ఈ సారి మాత్రం ఓ రీమేక్‌తో వస్తున్నాడు. అందునా ఎలాగైనా హిట్‌ కొట్టాలనే కసితో దిల్‌రాజుతో చేతులు కలిపాడు. ఈ మూవీలో ఆయన ఆస్థాన నటుడు ప్రకాష్‌రాజ్‌ ప్రధాన పాత్రను పోషిస్తున్నాడు. 2016లో వచ్చిన మరాఠీ చిత్రం ‘నటసామ్రాట్‌’కి ఇది రీమేక్‌. 

ఈ చిత్రానికి మహేష్‌మంజ్రేకర్‌ దర్శకత్వం వహించగా, నానా పాటేకర్‌ ప్రధాన పాత్రను పోషించి, మరీ నిర్మాణంలో భాగస్వామిగా మారాడు. ఆ నమ్మకంతో ఈయన దిల్‌రాజు చేత ఈ రీమేక్‌ హక్కులు కొనించి మన ముందుకు తేవడానికి సంసిద్దుడైపోయాడట. మరి క్రియేటివిటీ మాటను పక్కనపెట్టి రీమేక్‌ని నమ్ముకున్న కృష్ణవంశీ ఈ చిత్రానికి తెలుగుదనం తెచ్చే పనిలో మెరుగులు దిద్దుతున్నాడు. ఈ చిత్రంతో ఆయనకు క్రియేటివ్‌ డైరెక్టర్‌ అనే పేరు రాకపోయినా కనీసం కెరీర్‌ పరంగా మరలా హిట్‌ ట్రాక్‌లోనైనా పడతాడో లేదో వేచిచూడాల్సివుంది! 



By November 25, 2018 at 05:39AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43641/krishna-vamsi.html

No comments