Breaking News

‘నోటా’కి భయపడుతున్నట్లేగా..?


మనదేశం రహస్యాల దేశం అని నిరూపితం అవుతోంది. రహస్యాలు అంటే పురాతన విషయాలు, వేదాలు, ఉపనిషత్తులు, వేదభూమి వంటి విషయాలు కాదు.. తాజాగా సమాచార హక్కు కమిషనర్‌, మేధావి అయిన మాడభూషి శ్రీధర్‌ ఈ విషయాన్ని నెల్లూరులో వెల్లడించాడు. ఆయన మాట్లాడుతూ, దేశంలో, నాయకుల్లో నిజాయితీ కొరవడింది. భారతదేశం రహస్యాల దేశంగా మారింది. ఫిరంగి కన్నా అవినీతి ఇంకా ప్రమాదకరమైనది. లంచగొండితనం పెరుగుతోంది. బాపూజీ పేరును ఇష్టం వచ్చినట్లు వాడుకుంటున్నారు. ఇదొక సాంఘిక నేరం. ప్రతిపార్టీ, చివరకు గాంధీని చంపిన పార్టీ కూడా బాపూజీ పేరును అంబేడ్కర్‌ పేరును వాడుకుంటున్నాయి. మన చదువుల్లో నిజాయితీ లేదు. అనేక రాష్ట్రాలలోని విద్యాశాఖా మంత్రులకు డిగ్రీ కూడా లేదు. సమాచార హక్కు చట్టం ద్వారా దీనిని ప్రశ్నించాలి. 

ఇటీవల ఓ పౌరుడు సమాచార హక్కు చట్టం కింద లాల్‌బహదూర్‌ శాస్త్రి మరణిస్తే పోస్టుమార్టం నిర్వహించారా? చనిపోయిన తాష్కెంట్‌లో నిర్వహించారా? లేకుంటే భారత్‌లో నిర్వహించారా? అని అడిగినా దేశరహస్యం కింద సమాధానం ఇవ్వలేకపోయాం. విద్యామంత్రి చదువు నుంచి ప్రధాని మృతి వరకు అన్ని రహస్యాలే. అందుకే మనది రహస్యాల దేశం అయిందని ఆవేదన వెలిబుచ్చాడు. ఆయన ఆవేదనలో అర్థం ఉంది. 

ఇక విషయానికి వస్తే ఎన్నో ఏళ్ల కలలను సాకారం చేసుకుంటూ ఓట్ల ఈవీఎంలలో నోటా కూడా వచ్చింది. అయితే అసలు అభ్యర్ధులలో గెలిచిన అభ్యర్థి కంటే నోటాకి ఎక్కువ ఓట్లు పడితే ఏం చేయాలి? ప్రజా ప్రతినిధులను రీకాల్‌ చేసే సౌకర్యం ఉందా? అనేవి రావడం సహజం. వీటిపై యువతకు సందేశం ఇస్తూ తీశామని చెబుతున్న ‘నోటా’ చిత్రంపై రాజకీయ పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. తమిళంలో క్లీన్‌యూ సర్టిఫికేట్‌ పొందిన ఈ చిత్రం తెలుగులోకి వచ్చేసరికి ఓ బూతుపదం, కొన్ని డైలాగులు మ్యూట్‌లకు గురయ్యాయని సమాచారం. దాంతో సెన్సార్‌ ఇవ్వడంలో పలు ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే ఈ చిత్రం బిజెపి, టీఆర్‌ఎస్‌లకు అనుకూలంగా ఉంటుందనే వార్తలు బయటకు వస్తున్నాయి. అందుకే చెన్నైలోని తెలుగు యువశక్తి నేత కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి తెలంగాణలో దీని విడుదల ఆపాలన్నాడు. ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. 

‘నోటా’ చిత్రం ప్రేరణలో ఈవీఎంలలో ఉండే నోటాను జనాలు ఎక్కువగా నొక్కే ప్రమాదం ఉందంటూ అర్ధం పర్ధం లేని ఆరోపణలు చేశాడు. సినిమాని కేంద్ర ఎన్నికల కమిషన్‌, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌, సెన్సార్‌ వారు మరలా చూడాలని కోరాడు. కానీ అవ్వన్నీపరిశీలించిన తర్వాతే తాము సర్టిఫికేట్‌ ఇచ్చామని సెన్సార్‌ సమాధానం ఇచ్చిందట. ఇక నోటాను చూస్తే రాజకీయ పార్టీలకు అంత భయం ఎందుకు? సినిమాలో ఎన్టీఆర్‌, చంద్రబాబు, జయలలిత వంటి వారిపై సీన్స్‌ ఉన్నాయని, బిజెపి, టిఆర్‌ఎస్‌లకు అనుకూలంగా ఉందని అంటున్నారు. వాటిని తొలగించాలని చెప్పాలే గానీ నోటా ప్రభావితం చేస్తుందనే భయం ఈ గుమ్మడికాయ దొంగలకు ఎందుకు? అనేది అసలు ప్రశ్న. 



By October 05, 2018 at 05:37PM

Read More

No comments