Breaking News

త్రివిక్రమ్ మెడకు 'మొండికత్తి' పెట్టేశారు


కమర్షియల్‌ చిత్రాలలో కూడా తనదైన జీవితపు లోతులకి, మనిషిని, సమాజాన్ని ఆలోచింపజేసే సంభాషణకర్త, కథకుడు, దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌లో దాగి ఉన్నారు. ఇక ఏ చిత్రానికైనా ఏదో ఒక స్ఫూర్తి ఉండటంలో తప్పు లేదు. రామాయణం, మహాభారతం నుంచి మన పాత చిత్రాలు, ఇతర భాషల చిత్రాల నుంచి సన్నివేశాలు, మూలకథలు, ఏదో ఒక పాత్రను ప్రేరణగా తీసుకుంటూ ఉంటారు. ఉదాహరణకు మణిరత్నం, రాంగోపాల్‌వర్మ వంటి వారు కూడా సమాజంలో జరిగే సంఘటనలు, గాడ్‌ఫాదర్‌ వంటి చిత్రాలు, వాటిపాత్రలు, మూలకథల నుంచి ఇన్‌స్పైర్‌ అవుతూ ఉంటారు. మణిరత్నం తీసిన 'నాయకుడు' నుంచి 'దళపతి'(మహాభారతంలోని ధుర్యోధనుడు, కర్ణుడు, అర్జునుడు, కుంతీ) వంటి పాత్రల ప్రేరణతో ఉండేవే. ఇక 'బాహుబలి' నుంచి నిన్నటి మణిరత్నం చిత్రం 'నవాబ్‌' వరకు ఇలాంటి ఛాయలను ఎన్నో ఉదాహరణలుగా చెప్పవచ్చు. 

ఇక త్రివిక్రమ్ విషయానికి వస్తే 'నువ్వు నాకు నచ్చావ్‌'లోని ప్రకాష్‌రాజ్‌ కవితల నుంచి 'అ..ఆ' యద్దనపూడి సులోచనా రాణి నవల 'మీనా', అదే నవలతో విజయనిర్మల దర్శకత్వంలో వచ్చిన చిత్రం వరకు స్పూర్తా? కాపీనా అనేది ప్రేక్షకులకు తెలుసు. 'అజ్ఞాతవాసి' కాపీ విషయంలో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇక తాజాగా ఎన్టీఆర్‌-త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ల కాంబినేషన్‌లో వచ్చిన 'అరవింద సమేత వీరరాఘవ'పై కూడా ఇవే ఆరోపణలు వస్తున్నాయి. 2013  'ది ఫ్యామిలీ' అనే చిత్రంలోని కీలకమైన ఎపిసోడే ఈ చిత్రంలో కీలకపాత్ర పోషించింది. 

ఇక తాజాగా వేంపల్లి గిరిధర్‌ ఎపిసోడ్‌ కూడా త్రివిక్రమ్‌ మెడకు బాగా చుట్టుకుంది. రాయలసీమ యాసలో రచనలు చేయడం, రాయలసీమ ప్రాంతపు పరిస్థితులను హృద్యంగా చెప్పడంలో సిద్దహస్తుడు. అంతేకాదు కేంద్రీయ సాహిత్య అకాడమీ యువపురస్కారాన్ని ఆయన నాటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేతుల మీదుగా అందుకున్న ప్రతిభాశాలి. ఆయన తాజాగా మాట్లాడుతూ, త్రివిక్రమ్‌ నుంచి మొదటి సారిగా ఏప్రిల్‌ 15వ తేదీన ఫోన్‌ వచ్చింది. అర్జెంట్‌గా హైదరాబాద్‌ రమ్మని కోరారు. రామోజీ ఫిల్మ్‌సిటీలో ఎన్టీఆర్‌పై షూటింగ్‌ మొదలుకానున్న సందర్భం. సినిమాలో ఫస్ట్‌ ఫైట్‌ తీస్తున్నారు. షాట్‌గ్యాప్‌లో పరిచయం అయింది. నా పుస్తకాల వివరాలను తెలుసుకున్నారు. తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్శిటీ నుంచి రాయలసీమ ఫ్యాక్షన్‌ కథలపై పరిశోధన చేసి సర్టిఫికేట్‌ అందుకున్నందుకు ప్రశంసించారు. 'హిరణ్యరాజ్యం' అనే పుస్తకరూపం వచ్చిన దానిని ఆయనకు వివరించాను. అందులోని హీరోయిన్‌ పాత్రను వాడుకున్నారు. 'పాపాగ్ని' కథల్లో ఉన్న మొదటి కథ 'మొండికత్తి' నేపధ్యం గురించి అడిగారు. సినిమాలో పదే పదే వచ్చే 'మొండికత్తి'కి పునాదిగా వాడుకున్నారు. అతడిని కలవడం, నా కథల గురించి క్షుణ్ణంగా చెప్పడం నేను చేసిన తప్పు. మూడు రోజులు నేను వారితో ఉచితంగా వర్క్‌ చేశాను. ఇతరుల కథలను కాపీ కొట్టే ఇలాంటి దర్శకుల వల్ల మనం మోసపోతున్నాం. త్రివిక్రమ్‌ ఓ తెలివైన మూర్ఖుడు. మన కథల్లోని ఒక్కో పాత్రను తీసుకుని ఆయన కొత్తరకం వంటకం వండగలడు. అలా వండిన కథే 'అరవింద సమేత వీరరాఘవ'. నేను డబ్బులు ఆశించలేదు. కనీసం క్రెడిట్‌ కూడా ఇవ్వలేదు.. అంటూ ఆయన ఫొటో సాక్ష్యాలతో సహా బయటపెట్టాడు. 

నిజానికి ఈ చిత్రంలో అందరినీ ఆకట్టుకుంది 'మొండికత్తి' ఎపిసోడే. ఫస్ట్‌హాఫ్‌లో వచ్చే ఈ ఎపిసోడే తర్వాత కథ, కథనాలకు మూలస్థంభంగా నిలిచింది. యద్దనపూడి నుంచి ప్రతి కాపీ విషయంలోనూ త్రివిక్రమ్‌ కనీసం తాను ప్రేరణ లేదా కాపీ కొట్టిన వారికి థ్యాంక్స్‌ కార్డులు కూడా వేయకపోవడం, తర్వాత సాంకేతిక కారణాలు అని కవరింగ్‌ ఇవ్వడం మాత్రం బాధాకరమనే చెప్పాలి. 



By October 17, 2018 at 08:39AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43051/aravinda-sametha.html

No comments