Breaking News

జగన్‌పై హత్యాయత్నం: ఎన్నెన్ని మలుపులో!?


ప్రతిపక్షనేత, వైయస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసు పలు మలుపులు తిరుగుతోంది. దీని చుట్టూ రాజకీయ ప్రయోజనాలను అన్ని పార్టీలు దండుకోవాలని చూస్తుండటంతో దీనికి ఎనలేని ప్రాచుర్యం వస్తోంది. ఓట్ల రాజకీయాల కోసం దీనిని అందరూ వాడుకుంటున్న తీరు మాత్రం ఏహ్యకరమనే చెప్పాలి. ఒకవైపు హత్యాయత్నం జరిగిన వెంటనే బిజెపి నేతలు బయటకు వచ్చి ఏకంగా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు డిమాండ్‌ చేశారు. మరోవైపు వైసీపీ రాష్ట్రపతి పాలనకు డిమాండ్‌ చేయకుండా మరోరూపంలో దీనికి కావాల్సిన విధంగా సానుభూతి ఓట్ల కోసం ప్రయత్నాలు చేస్తుండగా, కనీసం పూర్తి వివరాలు లభ్యమయ్యే వరకు కూడా చూడకుండానే టిడిపి పెద్దలు దీనిని ఓ రాజకీయ గిమ్మిక్కుగా పేర్కొనడం కూడా తొందరపాటు చర్యేనని చెప్పాలి. 

ఒకనాడు స్వర్గీయ ఎన్టీఆర్‌పై మల్లెల బాబ్జీ అనే వ్యక్తి బొటనవేలిపై దాడి చేస్తే దానికి పావలా చికెన్‌కి ఒకటిన్నర రూపాయిల మసాలా అనే తరహాలో ఎన్టీఆర్‌ పెద్ద కట్టు కట్టుకుని నాడు సానుభూతి ఓట్ల కోసం ప్రయత్నించిన విషయం కూడా ఇదే కోవలోకి వస్తుందా? అనే అనుమానాలు మాత్రం బాగానే వ్యక్తమవుతున్నాయి. జగన్‌ వైజాగ్‌ ఆసుపత్రిలో చేరకుండా హైదరాబాద్‌లోని తన బంధువుల ఆసుపత్రిలో చేరడం, విశాఖ ఎయిర్‌పోర్ట్‌లోని ప్రథమ చికిత్సకు సంబంధించిన రిపోర్టులను హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్‌ వైద్యులు పరిశీలించారా? లేదా? అనేవాటికి కూడా సమాధానం లేదు. కేవలం జగన్‌కి ఇష్టమొచ్చినట్లుగా హైదరాబాద్‌ హాస్పిటల్‌ వారు నివేదికలు ఇచ్చారనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. వీటన్నిటి వెనుక ఢిల్లీ పెద్దలు బాగానే రాజకీయం పులిమారనే అనుమానాలకు తావు ఏర్పడటం కూడా గమనార్హం. 

విమానాశ్రయం కేంద్రపరిధిలో ఉంటుందనే విషయాన్ని కూడా బిజెపి పెద్దలు మర్చిపోవడం, వైసీపీ నాయకులు కేంద్రహోంమంత్రి రాజ్‌నాధ్‌సింగ్‌ని కలవడం ద్వారా బిజిపి స్కెచ్‌ అమలైందేమో అనే అనుమానాలు మొలకెత్తుతున్నాయి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం పక్కనపెడితే ఇలాంటి సంఘటనలు జరిగిన వెంటనే ప్రతి రాష్ట్రంలోనూ రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్‌ చేస్తే దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా పాలన సాగించలేదు. మరి రాష్ట్రపతి పాలనలో కూడా ఇలాంటి సంఘటనే జరిగితే మరి రాష్ట్రపతిని కూడా తొలగించి, ఐక్యరాజ్యసమితి పాలన పెడతారా? అనే వ్యంగ్యాస్త్రాలకు బిజెపి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. 

నక్సలైట్లు.. ఎమ్మెల్యేని, మాజీ ఎమ్మెల్యేలను చంపినా పట్టించుకోని గవర్నర్‌ జగన్‌ విషయంలో మాత్రం ఏకంగా డిజిపికి ఫోన్‌ చేయడం ఏమిటి? ఇక ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు వైఎస్‌ జగన్‌ని చంపాలనే ఉద్దేశ్యంతోనే నిందితుడు శ్రీనివాసరావు కోడిపందేల కత్తితో దాడి చేయబోయాడని రిమాండ్‌ రిపోర్ట్‌లో తెలిపారు. జగన్‌కి ప్రాణహాని చేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ దాడి జరిగిందని వారు స్పష్టం చేశారు. అయితే దాడి సమయంలో జగన్‌ అప్రమత్తంతో ఉండటం వల్లే జగన్‌ ప్రాణాలతో బయటపడ్డాడని పోలీసులు పేర్కొనడం టిడిపిపై పలు అనుమానాలు తాజాగా బలపడటానికి కారణమైంది. జగన్‌ మెడపై దాడి చేయాలని నిందితుడు భావించినట్లు రిమాండ్‌రిపోర్ట్‌ స్పష్టం చేసింది. ఈ దాడి ఘటన కోసం నిందితుడు రెండు కత్తులను తెచ్చాడని, మొదటి పోటు తప్పిపోయినా రెండో కత్తితో దాడి చేసేందుకు నిందితుడు సిద్దమై వచ్చాడని తేలింది. 

జగన్‌పై హత్యాయత్నం చేసిన శ్రీనివాసరావుకి వచ్చే నెల 2వ తేదీ వరకు జ్యుడీషియల్‌ కస్టడీని న్యాయస్థానం విధించింది. శ్రీనివాసరావు రాసిన లేఖతో పాటు ఆ లేఖ రాసేందుకు సహాయపడిన మరో ఇద్దరిని పోలీసులు సంయుక్తంగా విచారిస్తున్నారు. ఇక నిందితుడు తాను రాసినట్లు చెబుతోన్న 12 పేజీల లేఖ విమానాశ్రయంలో ఎవ్వరికీ, మీడియాకు కూడా చిక్కలేదు. కానీ అది తమ వద్ద బయటపడిందని పోలీసులు చెప్పడం మరిన్ని అనుమానాలకు తావిస్తోందనడంలో సందేహం లేదు. అయినా మొత్తానికి ఏపీ రాజకీయ ప్రకంపనలు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పలు చర్చలకు కారణమవుతున్నాయి. 



By October 31, 2018 at 03:20AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43267/attack-on-jagan.html

No comments