Breaking News

గాయని భువన కూడా ఆయన భాధితురాలేనట!


గాయని చిన్మయి శ్రీపాదతో పాటు తాజాగా ఆస్కార్‌ అవార్డు గ్రహీత ఎ.ఆర్‌.రెహ్మాన్‌ సోదరి రెహానా కూడా తమిళ సినీ సాహిత్యవేత్త, గేయ రచయిత వైరముత్తు అనే పెద్దమనిషిలోని మృగాడిని నిర్భయంగా బయట పెట్టింది. వైరముత్తు వ్యవహారంలో అనుమానాలు ఉన్న వారికి రెహానా ఆరోపణలతో మరింత క్లారిటీ వచ్చింది. ఇక తాజాగా మరో సీనియర్‌ గాయని వైరముత్తు వల్ల తన కెరీర్‌ నాశనం అయిన విధానాన్ని ఏదో మాట మాత్రంగా చెప్పకుండా ఆయన వేధింపులు ఎలా జరిగాయో విపులంగా వివరించింది. దాదాపు 20ఏళ్ల కిందటే వైరముత్తు తనని లైంగికంగా వేధించాడని గాయని భువనశేషన్‌ బయటపెట్టింది. 

ఆమె మాట్లాడుతూ, తన మాట వినకపోవడం, ఆయన చెప్పిన దానికి అంగీకరించకపోవడంతో వైరముత్తు నా కెరీర్‌ని నాశనం చేశాడు. దాంతో ఈ ఇండస్ట్రీలో ఉండటం కంటే తప్పుకోవడమే మేలని చెప్పి దీని నుంచి నిష్క్రమించాను. ఇన్నాళ్లు ఈ బాధని గుండెల్లో దాచుకున్నాను. మీటూ ఉద్యమం ఇచ్చిన ధైర్యంతో ఇప్పుడు ఈ పచ్చి నిజాలను బయటపెడుతున్నాను. చెన్నైలోని రంగరాజపురంలో ఉన్న జాయ్‌ స్టూడియోలో ఓ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పాటల రికార్డింగ్‌ జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్‌కి పాటల రచయితగా, నిర్మాతగా వైరముత్తు వ్యవహరించాడు. ఈ సందర్భంగా నా గొంతు చాలా బాగుందని, తమిళంపై నాకు మంచి పట్టు ఉందని ఆయన కితాబునిచ్చాడు. అనంతరం నా ఫోన్‌ నెంబర్‌ తీసుకున్నాడు. ఓ రోజు పాటకి సంబంధించిన డెమో ఇచ్చేందుకు ఇంటికి రావాలని కోరాడు. నేను వెళ్లి డెమో ఇచ్చాను. ఈ సందర్భంగా శివాజీగణేషన్‌, ఇళయరాజా వంటి పలువురు సినీ ప్రముఖుల గురించి మేం చర్చించుకున్నాం. అప్పటివరకు అన్ని బాగానే సాగాయి. ఓ రోజు వైరముత్తు నాకు ఫోన్‌ చేశాడు. నీ గొంతు మాత్రమే కాదు.. నువ్వు ఎంతో తెలివైన, అందమైన అమ్మాయివి. తెలివైన, అందమైన అమ్మాయిల కోసం అన్వేషిస్తున్న నా గాలింపు నీతోనైనా ముగుస్తుందా? అని ప్రశ్నించాడు. 

'నీ చూపులు చురకత్తుల్లా... నన్ను గుచ్చుకుంటున్నాయ్‌' అని ఓ చెత్త కవిత్వం కూడా చెప్పాడు. అయితే నాకిలాంటివి నచ్చవని చెప్పి ఫోన్‌ పెట్టివేశాను. పక్కరోజు ఫోన్‌ చేసి 'నేను మలేషియా పోతున్నాను... వస్తావా? అని అడిగాడు. పాడటానికా? యాంకరింగ్‌ చేయడానికా? అని నేను అడిగాను. దీనికి అతను వెంటనే.. 'ఆ రెండింటికి కాదు.. నువ్వేమైనా చిన్నపిల్లవా? ఆ మాత్రం అర్దం చేసుకోలేవా? అన్నాడు. నాతో వచ్చావంటే నీ లైఫ్‌ సెటిలైపోతుంది' అంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడాడు. నేను రానని, మరోసారి ఫోన్‌ చేయవద్దని స్పష్టం చేశాను. నాకు ఇలాంటివి నచ్చవని ఖరాఖండీగా చెప్పాను. దీంతో నా మాట వినకుంటే సినీ పరిశ్రమలో అవకాశాలు లేకుండా చేసి, నా కెరీర్‌ నాశనం చేస్తానని బహిరంగంగా హెచ్చరించాడు. ఆ తర్వాత అతను అన్నట్లే జరిగింది. ఈఘటన జరిగిన వెంటనే నా మూడు విదేశీ ట్రిప్పులు క్యాన్సిల్‌ అయ్యాయి. ఇదేంటి అని నిర్వాహకులను ప్రశ్నిస్తే 'మేడమ్‌..పైస్థాయి నుంచి విపరీతమైన ఒత్తిడి ఉంది అనేవారు. ఇంతగా దిగజారడం కంటే ఇండస్ట్రీ నుంచే తప్పుకోవడం మేలని చెప్పి దూరంగా వచ్చేశాను అని చెప్పింది. 



By October 25, 2018 at 02:18PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43177/singer-bhuvana.html

No comments