Breaking News

పవన్.. కవాతు ఇరగదీసినవ్: కేటీఆర్


నిజానికి మెగాస్టార్‌ చిరంజీవికి, పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌కి ఆంధ్రాలోనే కాదు.. తెలంగాణలో కూడా వీరాభిమానులు ఉన్నారు. కానీ చిరంజీవి 'ప్రజారాజ్యం' పార్టీ స్థాపించి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు తెలంగాణలో ఆయన పెద్దగా ప్రభావం చూపలేకపోయాడనేది వాస్తవం. కానీ స్టార్‌ హీరోలుగా మాత్రం వారికి జనాలు నీరాజనాలు పలికారు. ఇక నాడు ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి హవా బాగా సాగుతూ ఉండటం, మరోవైపు కేసీఆర్‌ తెలంగాణ ఉద్యమజోరు, చంద్రబాబు వంటి మహామహులు ఉండటంతో చిరు, పవన్‌లు ప్రజారాజ్యం ద్వారా తమ సత్తా చాటలేకపోయారు. కానీ ఇప్పటి పరిస్థితులు వేరు. పవన్‌ తనకు రెండు తెలుగు రాష్ట్రాలు సమానమే అని చెబుతున్నప్పటికీ తెలంగాణ వాదులు మాత్రం పవన్‌ని ఆంధ్రాకి చెందిన రాజకీయ నాయకుడిగానే చూస్తున్నారు. మరోవైపు ఆయన తెలంగాణలోని కొండగట్టు నుంచి యాత్రను ప్రారంభించి, ప్రస్తుతం ఏపీలో జోరుగా పర్యటన సాగిస్తున్నాడు. ఎన్నికలకు చాలా సమయం ఉందని భావించే తరుణంలోనే తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు కేసీఆర్‌ తెలివిగా పావులు కదిపాడు. అంతేకాదు.. ముందస్తు ప్రణాళికతో అభ్యర్ధులను కూడా ఖరారు చేసి దూసుకుపోతున్నాడు. 

తెలంగాణ విషయానికి వస్తే కేసీఆర్‌ని పవన్‌ ప్రత్యేకంగా కలిసినప్పటి నుంచి ఆయన టిఆర్‌ఎస్‌కి లోపాయికారీగా సహాయం చేయనున్నాడనే వార్తలు వస్తున్నాయి. మరోపక్క తెలంగాణలో కాంగ్రెస్‌, టిడిపి, సిపిఐ, టిజెఎస్‌ వంటివి మహాకూటమిగా ఏర్పడ్డాయి. టిడిపి తెలంగాణలో స్థిరపడిన ఆంధ్రా ఓటర్ల ప్రాబల్యం ఉన్న ప్రాంతాలలో తన సత్తా చాటాలని చూస్తోంది. కానీ మధ్యలో పవన్‌ అడ్డువస్తున్నట్లు విశ్లేషకులు అంటున్నారు. ఆంధ్రా ఓటర్లు బలంగా ఉండే నియోజకవర్గాలు సహజంగా 'మహాకూటమి'లో టిడిపికే కేటాయిస్తారు. అదే సమయంలో అవే స్థానాలలో పవన్‌ జనసేన అభ్యర్ధులను నిలబెడితే అది టిడిపికి గట్టి దెబ్బ తగిలే పరిస్థితులు నెలకొంటున్నాయి. మొదట పవన్‌ తెలంగాణలో కూడా సిపిఐ, బిసి నాయకులు, కోదండరాం, గద్దర్‌, జయప్రకాష్‌ నారాయణ్‌ వంటి వారితో పొత్తు పెట్టుకుంటారని, వారి భావజాలాలు కూడా తన విధంగానే ఉంటాయి కాబట్టి మరోవైపు గద్దర్‌, జెపి, వామపక్షాలతో పవన్‌కి ఎలాగూ మంచి సాన్నిహిత్యం ఉండబోతోంది కాబట్టి పవన్‌, కేసీఆర్‌, బిజెపి, కాంగ్రెస్‌లకు ప్రత్నామ్నాయంగా నిలబడతారని అందరు భావించారు. 

కానీ పవన్‌ అడుగులు మాత్రం కేసీఆర్‌కి అనుకూలంగానే పడుతున్నాయని తాజా పరిస్థితులు చూస్తే అర్ధం అవుతుంది. ఇక పవన్‌ తాజాగా రాజమహేంద్రవరంలోని ధవళేశ్వరం బ్యారేజీ మీద భారీగా జన సైనికులతో కవాతు  నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇవి విజయవంతమైన నేపధ్యంలో కేసీఆర్‌ తనయుడు, తెలంగాణ మంత్రి కేటీఆర్‌ పవన్‌కి ఫోన్‌ చేసి మరీ అభినందనలు తెలిపాడు. కేటీఆర్‌కి ఈ సందర్భంగా పవన్‌ కృతజ్ఞతలు తెలిపాడు. దీనిని బట్టి తెలంగాణ రాజకీయ చిత్రం ఎలా మారనుందో సూచనగా తెలిసిపోతోందనే చెప్పాలి. 



By October 19, 2018 at 03:28PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43081/pawan-kalyan.html

No comments