'జెంటిల్‌మేన్'పై తీవ్ర ఆరోపణలు..!
కర్ణాటకలో సినీ కుటుంబంలో జన్మించిన యాక్షన్ హీరో అర్జున్ సజ్రా. ఈయన పలు కన్నడ చిత్రాలతో పాటు తమిళ, తెలుగు భాషల్లో యాక్షన్ కింగ్‌గా పేరు తెచ్చుకున్నాడు. నిజానికి ఇతను దేశం గర్వించదగ్గ నటుల్లో ఒకరు. తెలుగులో భార్గవ్ ఆర్ట్ బేనర్‌లో ఎస్.గోపాల్‌రెడ్డి నిర్మాతగా కోడిరామకృష్ణ దర్శకత్వంలో ఆయన నటించిన మొదటి చిత్రం 'మాపల్లెలో గోపాలుడు' అద్భుత విజయం సాధించింది. ఆ తర్వాత కూడా ఆయన టాలీవుడ్‌లో పలు చిత్రాలలో నటించాడు. ఇక తమిళంలో ఈయన శంకర్ దర్శకత్వంలో నటించిన 'జెంటిల్‌మేన్, ఒకే ఒక్కడు' చిత్రాలు సాధించిన అద్భుత విజయం, వాటిల్లో అర్జున్ నటనకు లభించిన ప్రశంసలు మర్చిపోలేం. దర్శకునిగా శంకర్‌లోని ప్రతిభను గుర్తించి, 'జెంటిల్‌మేన్' చిత్రంతో అవకాశం ఇచ్చాడు. ఇలాగే ఈయన పలువురు దర్శక నిర్మాతలను పరిచయం చేయగా, వారందరూ టాప్ పొజిషన్‌లో ఉన్నారు. కమల్‌హాసన్‌తో పోటాపోటీగా 'ద్రోహి' చిత్రంలో యాక్ట్ చేశాడు.
ఇంకా విక్రమ్, సూర్య వంటి హీరోలు పరిచయం కాకముందే ఈయన కమల్ తర్వాత ఆ స్థాయిలో నటించగలిగిన దమ్మున్న నటునిగా పేరు గడించాడు. ఈయన దర్శక నిర్మాతగా మారి 'జైహింద్' దాని స్వీక్వెల్‌తో పాటు పలు దేశభక్తి నేపధ్యంలో సాగే చిత్రాలు తీసి, నటించాడు. ఈయన ఆగష్టు15న జన్మించడంతో స్వాతంత్య్ర దినోత్సవం రోజున పుట్టిన తనకు దేశభక్తి చిన్ననాటి నుంచే వచ్చిందని ఒకానొక సందర్భంలో తెలిపాడు. ఆయన కూతురు కూడా తమిళంలో హీరోయిన్. ఇక వ్యక్తిగత, వృత్తిగత జీవితాలలో కూడా ఆయనకు జెంటిల్‌మేన్ అనే పేరుంది. దాదాపు 30ఏళ్లకు పైగా హీరోగా నటిస్తున్న ఆయన ఇటీవల 'లై, నా పేరు సూర్య-నా ఇల్లు ఇండియా' వంటి చిత్రాలలో కీలకపాత్రలను పోషించాడు.
తాజాగా ఈయనపై ఓ నటి లైంగిక వేధింపులు చేశాడని ఆరోపించింది. ఆ నటి పేరు శృతి హరిహరన్. 'నింబునన్' (కురుక్షేత్రం) చిత్రం రిహాల్సర్స్‌లో భాగంగా అర్జున్ తనపట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. ఓ రొమాంటిక్ సీన్ రిహాల్సర్స్ సందర్భంగా అర్జున్ చేతులను తన వీపుపై ఉంచి గట్టిగా కౌగిలించుకుని, ఈ సీన్ ఇలా చేస్తే బాగుంటుందని దర్శకుడికి తెలిపాడని, ఒక నటి అనుమతి తీసుకోకుండా అలా చేయడం దారుణమని వ్యాఖ్యానించింది. ఈ ఘటనతో షాక్ అయిన తాను గట్టిగా అతడిని విదిలించుకుని రిహాల్సర్స్ నుంచి వెళ్లిపోయానని, సినిమా ప్రమోషన్స్‌లో కూడా ఇలాగే బిహేవ్ చేసేవాడని ఆరోపించింది. దీనిపై అర్జున్ స్పందించాడు. 'రిహాల్సర్స్ సందర్భంగా హీరోయిన్లను తాకాలనే నీచమైన బుద్ది నాకు లేదు. నేను ఎలాంటి వాడినో అందరికీ తెలుసు. దర్శకుడు లేకుండా రిహాల్సర్స్ జరగవు. ఒక్కసారిగా శృతి హరిహరన్ వ్యాఖ్యలతో షాక్‌కి గురయ్యాను. ఈ విషయమై కోర్టుకి వెళ్లి ఆమెపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని తెలిపాడు'.
By October 22, 2018 at 11:19AM
No comments