ఎన్టీఆర్.. మనసులను కదిలించేశాడు..!!
త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న అరవింద సమేత వీర రాఘవ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది.. పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటుగా.. ప్రమోషనల్ కార్యక్రమాల్లో జోరు చూపిస్తుంది అరవింద సమేత చిత్ర బృందం. హరికృష్ణ మరణంతో అరవింద సమేత అనుకున్న టైం కి రాదనుకున్నప్పటికీ..... ఎన్టీఆర్ ఏంతో నిబద్దతతో.. వృత్తి మీదున్న గౌరవంతో.... మిగిలిన నెల రోజుల షూటింగ్ పూర్తి చేశాడు. అరవింద ప్రమోషన్స్ లో భాగంగా అరవింద సమేత ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అభిమానుల సమక్షంలో నిర్వహించారు. ఈ వేడుకకి కళ్యాణ్ రామ్ ముఖ్య అతిధిగా హాజరై అరవింద ట్రైలర్ ని అనుకున్న టైంకి విడుదల చేశాడు. ఇక ఈ వేడుకలో కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ లు కన్నీళ్లతో కనిపించారు. తండ్రి మరణించి నెల రోజులు కావొస్తున్నా వారు తండ్రి జ్ఞాపకాలతోనే ఇంకా ఉన్నారన్నది వారి మొహంలో బాధ చూస్తుంటే తెలుస్తుంది.
అరవింద ఈవెంట్ స్టేజ్ మీద ఏడపోయినాడో.. అనే పాట వస్తున్నంత సేపు.. కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ లు కన్నీళ్లు పెడుతూనే ఉన్నారు. అలాగే కళ్యాణ్ రామ్ స్పీచ్ లో తాత ఎన్టీఆర్ ని, నాన్న, హరికృష్ణని తలుచుకుని మాట్లాడి అందరి గుండెలని కదిలేంచేశాడు. తమ్ముడు వృత్తి మీదున్న గౌరవంతో తమ తండ్రి మరణించిన ఐదో రోజే షూటింగ్ కి వెళ్లి, రాత్రిబవళ్ళు కష్టపడి అరవింద షూటింగ్ పూర్తి చేశాడని చెప్పడం.... కన్నీళ్లతో ఎన్టీఆర్ స్టేజ్ మీద అన్న కళ్యాణ్ రామ్ ని కౌగిలించుకుని బాధపడడం చూసిన నందమూరి అభిమానులే కాదు.. సగటు ప్రేక్షకుడు కూడా కంటతడి పెట్టేశారు. ఇక ఎన్టీఆర్ అరవింద స్టేజ్ మీద చిత్ర బృందంలోని అందరి గురించి పేరు పేరునా ప్రస్తావించి.. తాను ఇలా నెలరోజులు షూటింగ్ చేశానంటే అది త్రివిక్రమ్ వల్లే జరిగిందని.. తండ్రిలా, అన్నలా, స్నేహితుడిలా తన వెన్నంటే ఉన్నాడని.. త్రివిక్రమ్ కి ఎప్పటికి రుణపడి ఉంటానని చెప్పడమే కాదు.. తాను త్రివిక్రమ్ తో సినిమా చేయాలనుకుని 12 ఏళ్ళు అయ్యిందని.. తన పన్నెండేళ్ల కల ఈ రోజు నెరవేరిందని చెప్పాడు.
నెల రోజుల క్రితం తమ ఇంట్లో జరిగిన విషాద సంఘటనను గుర్తు చేసుకుని స్టేజ్ మీద భోరున విలపించేశాడు ఎన్టీఆర్. తన తండ్రి మరణించి తమకి దూరమవ్వలేదని.... అందరి మనసుల్లో ఉంటాడని.. ఆయన ఇక్కడే మన మధ్యనే ఉన్నాడని.. ఇంటి పెద్దని పోగొట్టుకుంటే ఎలా ఉంటుందో తనకి తెలుసనీ.. అలాగే తమ తండ్రి గారు చెప్పినట్టు.. ఈ జీవితం మీది.. మీకే అంకితం అంటూ అభిమానులనుద్దేశించి మాట్లాడుతూ.. చాలా ఎమోషనల్ అయ్యాడు. ఇక అలా చెప్పి బాధతో అక్కడి నుండి వెళ్లిపోతూ..... వెనుదిరిగి మళ్ళీ వచ్చి నాన్నకి చెప్పలేకపోయిన ఒక మాట మీకు చెబుదామని.. ఇళ్ళకి జాగ్రత్తగా వెళ్ళండి.. ఇంటి దగ్గర మీకోసం ఎదురు చూసే కుటుంబం ఉంటుందని.. ఎవరు ఒంటరిగా రోడ్డు మీద ఒంటరిగా నిలుచుని బాధపడే పరిస్థితి తేవొద్దని అభిమానులకు ఎన్టీఆర్ ఏంతో బాధతో విజ్ఞప్తి చేశాడు. కన్నీళ్లతో బాధపడుతున్న ఎన్టీఆర్ ని కళ్యాణ్ రామ్ అండగా భుజం మీద చెయ్యేసి ఓదార్చాడు. ఇక ఎన్టీఆర్ బాధతో మాట్లాడలేని స్థితిలో దర్శకుడు త్రివిక్రమ్... ఎన్టీఆర్ ని పట్టుకుని ఆత్మీయతను చాటాడు.
By October 04, 2018 at 02:07PM
Read More
No comments