Breaking News

నటుడు వైజాగ్ ప్రసాద్ ఇక లేరు


పలు చిత్రాల్లో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా.. అలాగే బుల్లితెర నటుడిగా పేరున్న వైజాగ్ ప్రసాద్ ఈ రోజు (ఆదివారం) తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో గుండెపోటుతో హైదరాబాద్ యశోద ఆస్పత్రిలో కన్నుమూశారు. గత కొంతకాలంగా  వైజాగ్ ప్రసాద్ అనారోగ్యంతో బాధపడుతూ... నటనకు స్వస్తి చెప్పి ఇంట్లోనే ఉంటూ రెస్ట్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం అయన వయసు 75 సంవత్సరాలు. విశాఖపట్నంలోని గోపాలపట్నంలో పుట్టిన ఆయన.. నటన మీదున్న ఆసక్తితో హైదరాబాద్‌కి వచ్చి సినిమాల్లో నటుడిగా మారారు. అసలు పేరు కొర్లాం పార్వతీ వరప్రసాదరావు. ఆయనకు కుమార్తె రత్నప్రభ, కుమారుడు రత్నకుమార్‌ ఉన్నారు.  ప్రస్తుతం వారు అమెరికాలో ఉన్నట్లుగా తెలుస్తోంది. 

1963లో నాటక రంగంలోకి ప్రవేశించిన వైజాగ్‌ ప్రసాద్.. అప్పు పత్రం, భలే పెళ్లి, భజంత్రీలు, కాల ధర్మం, ఆకలి రాజ్యం, హెచ్చరిక, వేట కుక్కలు, కాలకూటం, ఋత్విక్‌, గరీబీ హఠావో లాంటి నాటికలతో ప్రేక్షకుల మన్ననలు పొందారు. సుమారు 700 నాటికల్లో నటించిన ఆయనను 1983లో బాబాయ్‌ అబ్బాయ్‌ సినిమా ద్వారా సినీ రంగానికి జంధ్యాల పరిచయం చేశారు. కొంత గ్యాప్ తరువాత నువ్వు నేను సినిమాతో మళ్లీ వచ్చారు. ఆ తర్వాత భద్ర, జై చిరంజీవ, జెమిని, అల్లరి బుల్లోడు, సుందరకాండ, రాణిగారి బంగ్లా, గౌరి తదితర చిత్రాల్లో ఆయన నటించారు. ఇక బుల్లితెర మీద పలు సీరియల్స్ లో వైజాగ్ ప్రసాద్ ప్రేక్షకులకు సుపరిచితుడే. వైజాగ్ ప్రసాద్ మరణవార్త విన్న సినీ ప్రముఖులు నివాళులర్పిస్తూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు.



By October 22, 2018 at 03:04AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43118/vizag-prasad.html

No comments