Breaking News

దిల్‌రాజు అదే నిర్ణయం మీద ఉంటాడా?


తెలుగులో ఉన్న అతితక్కువ మంది మంచి అభిరుచి ఉన్న నిర్మాతల్లో దిల్‌రాజు ముఖ్యులు. నేడు అల్లుఅరవింద్‌ తర్వాత అంతటి ప్రతిభ, కొత్త టాలెంట్‌ని పసిగట్టడం, సరైన కథలను ఎంచుకోవడం, దానికి తగ్గ ట్రీట్‌మెంట్‌, నటీనటుల, సాంకేతిక నిపుణులు ఎంపికలో ఈయన తనదైన ప్రత్యేకతను చూపుతూ ఉంటారు. నేటి యువ నిర్మాతలకు అల్లుఅరవింద్‌, సురేష్‌బాబులతో పాటు ఈయన కూడా స్ఫూర్తి అనే చెప్పాలి, నేడు ప్రేక్షకులు, బయ్యర్లు కూడా దిల్‌రాజు నిర్మాత అంటే దానిపై ముందుగానే ఓ అంచనాలకు వస్తారు. నేడు మైత్రిమూవీమేకర్స్‌, యువి క్రియేషన్స్‌ వంటి వారిపై కూడా ఈయన ప్రభావం డైరెక్ట్‌గానో, ఇన్‌డైరెక్ట్‌గానో ఉందనే చెప్పాలి. 

ఈయన ఈ మధ్య డిస్ట్రిబ్యూషన్‌ పరంగా మాత్రం అపజయాలను మూటగట్టుకుంటూ ఉన్నాడు. ఇక ‘దువ్వాడ జగన్నాథం, శ్రీనివాసకళ్యాణం’ వంటి చిత్రాలు ఆయన అంచనాలను తల్లకిందులు చేశాయి. కానీ ప్రస్తుతం ఆయన రామ్‌ హీరోగా హ్యాట్రిక్‌ హిట్‌ కోసం ఎదురుచూస్తోన్న త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ‘హలో గురూ ప్రేమకోసమే’, వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌లతో అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్‌2’ చిత్రాలను నిర్మిస్తున్నాడు. ఇక అశ్వినీదత్‌ భాగస్వామ్యంలో మహేష్‌బాబు ప్రతిష్టాత్మక 25 వ చిత్రం ‘మహర్షి’ని తానే పరిచయం చేసిన వంశీపైడిపల్లి దర్శకత్వంలో నిర్మిస్తున్నాడు. ఇక ఈయన ఈమధ్య కొన్ని అనువాద చిత్రాల విషయంలో కూడా దెబ్బతిన్నాడు. మణిరత్నం ‘చెలియా’ కూడా నిరాశపరిచింది. అందుకే ఆయన మరో మణిరత్నం చిత్రం ‘నవాబ్‌’ విషయంలో మణిరత్నం అడిగినా వెనకడుగే వేశారని అంటారు. కానీ ఈ చిత్రం మంచి కలెక్షన్లు సాధిస్తుండటం విశేషం. 

తాజాగా విజయ్‌సేతుపతి, త్రిషలు నటించిన తమిళ చిత్రం ‘96’ చిత్రం హక్కులను తమిళంలో ఈ సినిమా రిలీజ్‌కి ముందే కొనేశాడు. ఈ చిత్రం తాజాగా విడుదలై విమర్శకుల ప్రశంసలను, మంచి రేటింగ్స్‌ని సాధిస్తోంది. అయితే కమర్షియల్‌ పరంగా ఈ చిత్రం ఏ విధంగా విజయం సాధిస్తుందో వేచిచూడాలి. ఇక ఈ చిత్రం విడుదలైన తర్వాత అయితే దీని రీమేక్‌రైట్స్‌కి మంచి పోటీ ఏర్పడి ఉండేది. నాకు దిల్‌రాజు ఈ చిత్రంలో ఏమి చూసి ముందుగా నిర్ణయం తీసుకున్నాడో కానీ తక్కువ ధరకే రీమేక్‌ రైట్స్‌ని సొంతం చేసుకుని తన నిర్ణయం సరైనదే అని నిరూపించాడు. ఈ మూవీ విజయ్‌సేతుపతి, త్రిషల కెరీర్‌లోనే బెస్ట్‌ చిత్రం అనే కాంప్లిమెంట్స్‌ ఉన్నాయి. 

ఇక దీని రీమేక్‌లో దిల్‌రాజు ఎలాంటి క్యాస్టింగ్‌ని ఎంచుకుంటాడు? కమర్షియల్‌గా కూడా తెలుగులో భారీ విజయం సాధించేందుకు ఎలాంటి మార్పులు చేస్తాడు? అనేది ఆసక్తికరంగా మారాయి. కానీ కొందరు మాత్రం ఈ చిత్రాన్ని రీమేక్‌ చేస్తే చిత్రంలోని ఫ్లేవర్‌ పోతుందని, డబ్బింగ్‌ చేస్తేనే బాగుంటుందని భావిస్తున్నారు. మరి ఈ విషయంలో దిల్‌రాజు ఇప్పటికే స్పష్టత ఇచ్చి రీమేక్‌ చేస్తానని చెప్పినా, ఏమైనా నిర్ణయం మార్చుకుంటాడా? ముందుకు అనుకున్నట్లే రీమేకే చేస్తాడా? అనేది వేచిచూడాల్సివుంది...! 



By October 08, 2018 at 04:35AM

Read More

No comments