Breaking News

జనసేనానికి ఇవి ప్లస్‌ అయ్యేనా..!?


పవన్‌ మాటల్లో నిలకడ లేదని, ఆయన నుంచి టిడిపి, వైసీపీ, కాంగ్రెస్‌ తదితర పార్టీలకు ప్రత్యామ్నాయంగా అందరు భావించిన గొప్ప ఉద్దేశాలు కనిపించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఆయన పార్టీ, నాయకత్వం కూడా కొత్త సీసాలో పోసిన పాత సారే అన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయి. ఆరోపణలు లేకుండా ఎవరో ఏదో చెప్పారని ఆరోపణలు చేయడం, సమాజానికి ఉపయోగపడే విమర్శలు కాకుండా ఆయన కూడా వ్యక్తిగత ఆరోపణలతో ముందుకు వెళ్తుండటం, ఒకసారి తాను ప్రశ్నించడానికే వచ్చానని, మరోసారి ప్రభుత్వం ఏమి చేసినా తప్పు పట్టడం తన నైజం కాదని, సహజమైన విషయాలపై తాను రాద్దాంతం చేయబోనని చెప్పడం, కానీ వాటికి విరుద్దంగా ఆయన వ్యవహరిస్తున్న తీరు, తెలంగాణ ఎన్నికల విషయంలో దాదాపు చేతులెత్తేయడం, జగన్‌, బిజెపిల మీద మాత్రం పెద్దగా విమర్శలు చేయకపోవడం, రాజకీయాలే దరిద్రంగా తయారైనప్పుడు, అన్నిచోట్లా, అన్ని పార్టీలలో, అందరు నాయకులు, అధికారులలో అవినీతి, వారసత్వం అనేవి ఉన్నా ఆయన కేవలం టిడిపిని, బాబు, లోకేష్‌ వంటి వారపైనే ఘాటు విమర్శలు చేయడం సరికాదు. 

ఇక ఆయన మేనిఫెస్టో కూడా దండగమారిన సంక్షేమ పథకాలు రిజర్వేషన్లతోనే నిండి ఉండి, సమాజంలో మార్పు, అభివృద్దిని విస్మరించడం బాధాకరం. ప్రత్యేకహోదాపై నామమాత్రంగా మాట్లాడుతూ, రాఫెల్‌ నుంచి జగన్‌ అవినీతి వంటి విషయాలను పక్కనపెట్టడం సహేతుకం కాదు. కానీ ఒకమాట మాత్రం చెప్పగలం. అదేమింటే వచ్చే ఎన్నికల్లో గెలుపు ఓటములను నిర్ణయించే కీలకమైన ఓటు బ్యాంకు మాత్రం పవన్‌కి ఉంది. ఇక చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించేనాటికి రాష్ట్రంలో రాజకీయ శూన్యతలేదు. వైఎస్‌, బాబులిద్దరు బలంగానే ఉన్నారు. కానీ బాబు ఓడిపోయడం, ప్రభుత్వ అంటే వైఎస్‌ వ్యతిరేక ఓట్లు చీలిపోయి వైఎస్‌ రెండో సారి సీఎం కావడంలో కూడా ప్రజారాజ్యం పార్టీది కీలకపాత్ర. ఇక పవన్‌ సినిమాల పరంగా చిరంజీవికి వారసత్వంగానే వచ్చి ఉండవచ్చు. కానీ కేవలం నాలుగు చిత్రాలతో చిరు అభిమానులనే కాదు.. యువత అభిమానాన్ని కూడా పొందాడు. ‘ఖుషీ’ నుంచి ఇటీవల వచ్చిన ఆయన డిజాస్టర్‌ చిత్రాల ఓపెనింగ్స్‌ చూసినా ఆయన ఇమేజ్‌ చిరు కంటే ఎక్కువగా ఉందా? అనే అనుమానం వస్తుంది. ఇక వచ్చే ఎన్నికల విషయానికి వస్తే ప్రజలు బిజెపి, కాంగ్రెస్‌ల మద్య తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. చంద్రబాబుపై వస్తున్న ఆరోపణలు, ప్రతిపక్షనేతగా, చంద్రబాబుకి ప్రత్యామ్నయం తానేనని జగన్‌ నిరూపించుకోలేకపోతున్నాడు. వచ్చే ఎన్నికల్లో జగన్‌ గెలుస్తాడని వాదించేవారు కూడా అది చంద్రబాబు వ్యతిరేకత వల్లనే అనేది ఒప్పుకోవాలి తప్ప జగన్‌ మీద అభిమానంతోకాదు. 

టిడిపి, వైసీపీలవి ఇద్దరివీ అవినీతి పార్టీలే అనే వాదన పవన్‌కి లాభిస్తుంది. మూడో ప్రత్యామ్నాయంగా జనసేనని బలోపేతం చేసే చాన్స్‌ పవన్‌కి ఉన్నాయి. మరోవైపు త్వరలోనే పంచాయతీ ఎన్నికలు జరిపించాలని కోర్టు ఆదేశించింది. ఏ పార్టీకైనా గ్రామాలు, కేత్ర స్థాయిలో గెలవాలంటే ఇలాంటి ఎన్నికలు బాగా లాభిస్తాయి. 2014లో ఇలానే వైసీపీ గ్రామగ్రామాన విస్తరించింది. ఈ ఎన్నికలు జరిగితే పలు వలసలు, నాయకులు, గ్రామస్థాయిలో పటిష్టం చేసుకోవడానికి పవన్‌కి వీలుంటుంది. గెలుపు విషయం పక్కనపెడితే జనసేన మారుమూలలకు కూడా విస్తరిస్తుంది. ఇక చిరు ఓడిన విధానం కంటే ఆయన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం ఎవ్వరికీ నచ్చలేదు. కానీ చిరుని గెలిపించడంలో కాపులు సమైక్యంగా వ్యవహరించలేకపోయారు. 

ఒకవైపు కాపు రిజర్వేషన్ల సమస్య. గతంలో కంటే కాపుల ఐక్యత పెరుగుతున్న నేపధ్యంలో ఇప్పుడు పవన్‌ గెలవకపోతే భవిష్యత్తులో తమకి అంతటి అవకాశం రాదనే ఆలోచన కాపుల్లో ఉంది. ఇది పవన్‌కి మేలు చేస్తుంది. ఇక చిరు మీడియా విషయంలో వైఫల్యం చెందాడు. ప్రస్తుతం పవన్‌కి కూడా పూర్తి మీడియా మద్దతు లేకపోయినా నేడు సోషల్‌మీడియా బాగా విస్తరించి, ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాలకు కూడా పోటీ ఇస్తోంది. ఇది కూడా పవన్‌కి సానుకూలంగా మారే అవకాశం ఉంది. చానెల్‌ 99, ఆంధ్రప్రభ వంటి వారు సపోర్ట్‌ చేసి, మిగిలిన వారు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోయినా రాజమహేంద్రవరం కవాత్తుకి లక్షల జనాభా రావడం గమనీయం. ఇవ్వన్నీ సరిగా ఉపయోగించుకుంటే అవి జనసేనానికి బాగా కలిసొచ్చే అంశాలే అవుతాయి. మరి వీటిని పవన్‌ ఎలా వాడుకుని సద్వినియోగం చేసుకుంటాడో వేచిచూడాల్సివుంది..!



By October 28, 2018 at 01:30PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43228/pawan-kalyan.html

No comments