Breaking News

‘సవ్యసాచి’: అభిమన్యుడు కాదు.. అర్జునుడు!


అక్కినేని నాగచైతన్య ఇటీవలే ‘శైలజారెడ్డి అల్లుడు’ వంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ద్వారా కమర్షియల్‌హిట్‌ సాధించాడు. సినిమా విమర్శకులను మెప్పించలేకపోయినా.. సగటు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణనే చూరగొంది. ఇక నాగచైతన్య.. విభిన్నచిత్రాల యంగ్‌టాలెంటెడ్‌ దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వంలో నటిస్తున్న ‘సవ్యసాచి’ మాత్రం ఖచ్చితంగా ఆయన కెరీర్‌లోనే ఓ వైవిధ్యభరితమైన చిత్రం అవుతుందనే నమ్మకం అందరిలో ఉంది. ‘సవ్యసాచి’ అంటే రెండు చేతులను సమానమైన బలంతో ఉపయోగించుకోగలిగిన సత్తా ఉన్న వ్యక్తి అని అర్ధం. ఇందులో నాగచైతన్య ఎడమచేతికి కూడా కుడి చేతికి ఉన్నంత పవర్‌ ఉంటుందనే విషయం తెలిసిందే. ఈ చిత్ర కథ ఎంతో నచ్చి భాష రాకపోవడం వల్ల తెలుగులో చిత్రాలు చేయనని ప్రకటించిన దేశం గర్వించదగ్గ నటుడు మాధవన్‌ ఇందులో విలన్‌ పాత్రకు ఒప్పుకోవడం, కీరవాణి వంటి సంగీత దర్శకుడు బాహుబలి తర్వాత ఇష్టపడి మరీ చేసిన చిత్రం కావడం వల్ల సమ్‌థింగ్‌ స్పెషల్‌ అనే రీతిలో ఉంటుందని నమ్మకం ఏర్పడుతోంది. 

ఇక ఇందులో నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, నాగచైతన్య అక్కగా నిన్నటి టాప్‌స్టార్‌ హీరోయిన్‌ భూమిక మరో కీలకపాత్రను పోషిస్తూ ఉండటం విశేషం. ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపధ్యంలో సినిమా నుంచి ట్రైలర్‌ని విడుదల చేశారు. ప్రధాన పాత్రలను కవర్‌ చేస్తూ ఈ ట్రైలర్‌ని కట్‌ చేశారు. లవ్‌, కామెడీ, ఎమోషన్స్‌, యాక్షన్‌ సీన్స్‌ని చూపిస్తూ సాగిన ఈ ట్రైలర్ సినిమాపై ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తోంది. 

‘వాడిని చూస్తుంటే పద్మవ్యూహంలో అభిమన్యుడిగా ఉన్నాడు కదూ’ అని హీరోని ఉద్దేశించి ప్రతి నాయకుడు తన పక్కనే ఉన్న వ్యక్తితో అంటే ‘మీది పద్మవ్యూహమే సార్‌.. కానీ అతను అభిమన్యుడిలా కాదు.. అర్జునుడిలా కనిపిస్తున్నాడు’ అనే డైలాగ్‌ ఈ ట్రైలర్‌లో హైలైట్‌గా నిలిచింది. ‘చావైనా నిను చేరాలంటే నీ ఎడమచేతిని దాటుకుని రావాలి’ అంటూ హీరో ఎడమచేతికి ఉన్న పవర్‌ గురించి రావు రమేష్‌ చెప్పే డైలాగ్‌లో ఏదో రహస్యం ఉందనే నమ్మకం కలుగుతోంది. మొత్తానికి ఈ చిత్రం విభిన్న చిత్రాలను ఆదరించే ప్రేక్షకులు బాగా ఎదురు చూస్తున్న చిత్రంగా, చందు మొండేటి-నాగచైతన్యల కాంబినేషన్‌లో ‘ప్రేమమ్‌’ తర్వాత మరో పెద్ద హిట్‌గా నిలిచే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. 

Click Here for Trailer



By October 26, 2018 at 05:33AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43188/savyasachi.html

No comments