Breaking News

మాటలు కాదు మనోజ్.. రంగంలోకి దిగు!!


మెగా హీరోలకు ఉన్నంత క్రేజ్‌ మంచు హీరోలకు లేకపోవచ్చు. కానీ మెగా ఫ్యామిలీకి ఉన్నంత ఆర్ధిక స్తోమత మాత్రం మంచు ఫ్యామిలీకి కూడా ఉంది. మోహన్‌బాబు సంపాదనతో మంచు హీరోలు, మంచు కోడళ్లు ఎన్ని చిత్రాలు నిర్మించి ఫ్లాప్‌ అయినా ఇంకా ఇంకా తీసి ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించే శక్తిసామర్ద్యాలు మంచు విష్ణు, మంచు మనోజ్‌, మంచు లక్ష్మీప్రసన్నలకు దండిగా ఉంది. ఇక మంచు విష్ణు విషయం పక్కనే పెడితే ఆ ఫ్యామిలీలో మంచు లక్ష్మి మాత్రం సమాజంలోని పేదలకు సహాయపడాలనే తపన కాస్త ఉంది. మరి అది నిజమో.. లేక పబ్లిసిటీ కోసమో తెలియదు గానీ ఆమె నిర్వహించే 'మేము సైతం' కార్యక్రమం దీనికి ఉదాహరణ. 

ఇక తాజాగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో తిత్లీ తుపాన్‌ భీభత్సం చూపించింది. ఎందరో నిలువునా రోడ్డున పడ్డారు. ఆస్థినష్టం బాగా వాటిల్లింది. ఏపీ ప్రభుత్వం ఎంతో కష్టపడినా ప్రాణనష్టాలను తగ్గించగలిగిందే గానీ ఎవరి వల్లా కాని ఆస్థినష్టాన్ని మాత్రం ఏమీ చేయలేకపోయింది. దీనిపై ముందుగా స్పందించిన హీరో బర్నింగ్‌ స్టార్‌ సంపూర్ణేష్‌బాబు. ఆ తర్వాత జూనియర్‌ ఎన్టీఆర్‌, బాలకృష్ణ, నందమూరి కళ్యాణ్‌రామ్‌, అనిల్‌రావిపూడి, వరుణ్‌తేజ్‌, విజయ్‌దేవరకొండ, అల్లుఅర్జున్‌, నిఖిల్‌ వంటి వారు ముందుకు వచ్చారు. ఇక జనసేనాని మెగాపవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ అయితే తన అభిమానులతో, కార్యకర్తలతో అక్కడ భారీగా సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేశాడు. తాను కూడా అక్కడ పర్యటించాడు. అయితే తాను ముందుగా అక్కడికి వెళ్తే సహాయ చర్యలకు ఆటంకం కలుగుతుందనే ఆలోచనతో తాజాగా అక్కడికి చేరుకున్నాడు. 

అదే సమయంలో పవన్‌ తన అబ్బాయ్‌ రామ్‌చరణ్‌కి ఈ రెండు బాధిత గ్రామాలలో ఏదో ఒక దానిని దత్తత తీసుకోవాలని కోరడం, అందుకు చరణ్‌ వెంటనే తాను దత్తత తీసుకోవాల్సిన అవసరం ఉన్న గ్రామాన్ని గుర్తించేందుకు టీంని పంపి కార్యరంగంలోకి దూకాడు. దీనిపై చెర్రీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా మంచు మనోజ్‌ కూడా స్పందించాడు. చరణ్‌పై ట్విట్టర్‌ వేదికగా ప్రశంసల వర్షం కురిపించాడు. చరణ్‌ గ్రామాన్ని దత్తత తీసుకునేలా ప్రోత్సహించిన పవన్‌కి ఆయన ధన్యవాదాలు తెలిపాడు. 'అంతా మన నుంచే మొదలవ్వాలి. నిన్ను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది అన్నా.. గొప్ప కార్యక్రమం చేపట్టావు. ఇలాంటి పనిని చేపట్టేందుకు చరణ్‌కి స్ఫూర్తినిచ్చిన పవన్‌కి ధన్యవాదాలు. కష్టాలలో ఉన్న వారిని ఆదుకోవడం కంటే మంచి పని ఇంకేముంటుంది?' అని అన్నాడు. 

ఎంతైనా ఉప్పునిప్పుగా చెప్పుకునే చిరు-మోహన్‌బాబుల వారసులు మాత్రం ఎంతో పరస్పర అభిమానంతో ఉండటం హర్షించదగ్గ పరిణామమే. అయినా మంచు మనోజ్‌ కూడా బాధితులకు తన వంతు సాయం చేస్తే మాటల ద్వారా కన్నా చేతల ద్వారా నిరూపించుకున్న వాడు అవుతాడని చెప్పాలి. ఎందుకంటే నేడు ఎవరైనా సరే ఇచ్చే ప్రతి రూపాయి బాధితుల జీవితాలను పునర్మించడానికి సాయపడుతుంది...! ఎంత ఇచ్చామనేది ముఖ్యం కాదు... మనం సాటి మానవులుగా స్పందించామా? లేదా? అన్నదే ముఖ్యం.



By October 24, 2018 at 01:04PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43160/manchu-manoj.html

No comments