Breaking News

అనుమానాలకు ఆస్కారం ఇస్తోంది పవనేగా!


పవన్‌కళ్యాణ్‌ తన జనసేన పార్టీని అన్ని పార్టీలకు ప్రత్యామ్నయంగా ఉండాలని కోరుకుంటున్నాడా? లేక ఎవరితోనైనా పొత్తులు, లేకపోతే రహస్య సర్దుబాట్లు చేసుకోవాలని చూస్తున్నాడా? అనే విషయంలో పలు వార్తలు షికారు చేస్తున్నాయి. ఆయన కేవలం ఏపీకే పరిమితం కానున్నాడా? రెండు తెలుగు రాష్ట్రాలలోనూ తన సత్తా చాటనున్నాడా? అనే విషయం వచ్చిన అనుమానాలకు తెలంగాణ విషయంలో ఆయన పాటిస్తున్న మౌనం సమాధానం ఇస్తోంది. మరోవైపు ఆయనకు వామపక్షాల మద్దతు ఉన్నా కూడా ఏపీలోని అన్ని స్థానాలకు పోటీ చేస్తానని ప్రకటించడం కూడా గమనార్హం. అంటే వామపక్షాలతో ఆయన పొత్తు ఉండకపోవచ్చని అర్ధమవుతోంది. 

అదే సమయంలో ఆయన కిందటి ఎన్నికల్లో టిడిపి-బిజెపిలకి మద్దతు ఇచ్చాడు. తన జనసేనను ప్రత్నామ్నాయ పార్టీగా నిలబెట్టాలనే కోరిక మొదటి నుంచి ఉండి ఉంటే ఆయన ఆ నిర్ణయం తీసుకోకపోయి ఉండేవాడు. మరోవైపు టిడిపి నేతలపై, బాబు, లోకేష్‌లపై విమర్శలు చేస్తోన్న విధంగా ఆయన కేంద్రంలోని మోడీ సర్కార్‌ ప్రజా, ఏపీ వ్యతిరేక విధానాలపై, వైసీపీ నేతల అవినీతి, అక్రమాలు, ఫ్యాక్షన్‌ రాజకీయాలపై మాట్లాడలేకపోతున్నాడు. మరోవైపు తాను వచ్చే ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పాటులో కీలకం అవుతానని చెబుతూనే, మరోపక్క ఎన్నికోట్లు ఖర్చుపెట్టినా టిడిపిని మాత్రం అధికారంలోకి రానివ్వనని తేల్చిచెప్పాడు. దీని పరమార్ధం బాగానే అర్ధమవుతోంది. 

వచ్చే ఎన్నికల్లో జనసేన సీట్లు కీలకం అయితే ఆయన వైసీపీకి మద్దతు ఇస్తాడనే వాదనలో బలం ఉంది. మరోవైపు వైసీపీ బిజెపితో రహస్య ఒప్పందం ద్వారా ముందుకు వెళ్తోందని ఏపీ ప్రజల్లో నిశ్చితాభిప్రాయం ఉంది. అంటే పవన్‌ వామపక్షాలతో కలిసేకంటే బిజెపికి లోపాయికారీ మద్దతు ఇస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో పవన్‌ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. 

ఆయన తాజాగా ట్విట్టర్‌ ద్వారా స్పందిస్తూ.. ‘‘అదిగో పులి.. అంటే ఇదిగో తోక అన్నట్లుగా కొందరు ఊహాగానాలు చేస్తూ ప్రచారం చేస్తున్నారు. జనసేనకి ఏపార్టీ అండ ఉండనక్కరలేదు. జనసేన.. ఆ పార్టీతో కలుస్తుంది.. ఈ పార్టీతో కలుస్తుంది అని జరుగుతున్న ప్రచారం నిజం కాదు. సీట్ల సర్దుబాటు కూడా అయిపోయిందని మరింత ముందుకు వెళ్లి కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మనకి ఏ పార్టీ అండా దండా అవసరం లేదు. మన బలం జనం.. చూపిద్దాం ప్రభంజనం’’ అని ట్వీట్ చేశాడు. కానీ ఈ మాటలను పవన్‌ మాటల ద్వారా కాక చేతల ద్వారా చూపించాలని, అందరికీ సమాన దూరం పాటించాలని కొందరు విశ్లేషిస్తుండటం విశేషం. 



By October 30, 2018 at 01:30PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43261/pawan-kalyan.html

No comments