పిట్స్ బర్గ్ లో వైభవంగా శ్రీనివాస కల్యాణం

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
పిట్స్ బర్గ్ లో వైభవంగా శ్రీనివాస కల్యాణం
తిరుపతి, 2018, సెప్టెంబరు 30: టిటిడి ఆధ్వర్యంలో అమెరికాలోని పిట్స్ బర్గ్ లో గల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఆదివారం శ్రీనివాస కల్యాణం వైభవంగా జరిగింది. ఈ కల్యాణోత్సవంలో ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
హైందవ ధర్మ పరిరక్షణతోపాటు సమాజంలో భక్తిభావాన్ని, ఆధ్యాత్మిక విలువలను కూడా టిటిడి ప్రచారం చేస్తోంది. ఇందులో భాగంగా దేశ విదేశాల్లో భక్తులకు స్వామి, అమ్మవార్ల కల్యాణాన్ని కనులారా వీక్షించే భాగ్యాన్ని శ్రీనివాస కల్యాణాల ద్వారా టిటిడి కల్పిస్తోంది. సుదూర ప్రాంతాల నుండి తిరుమలకు వచ్చి స్వామివారి కల్యాణోత్సవ సేవలో పాల్గొనలేని భక్తులకు ఈ కల్యాణాలు విశేష ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తున్నాయి.
ముందుగా వేద పండితులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవర్లను కల్యాణవేదిక వద్దకు తీసుకొచ్చారు. అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, కంకణధారణ చేశారు. ఆ తరువాత అగ్నిప్రతిష్టాపన, యజమాని సంకల్పం, భక్త సంకల్పం, మహాసంకల్పం, మంగళసూత్రధారణ ఘట్టాలతో వేదమంత్రాలు పఠిస్తూ శాస్త్రోక్తంగా స్వామివారి కల్యాణాన్ని నిర్వహించారు. చివరిగా నక్షత్రహారతి, మంగళహారతి కార్యక్రమంతో కల్యాణం దిగ్విజయంగా ముగిసింది. శ్రీవారు, అమ్మవార్ల కల్యాణ ఘట్టాన్ని నేత్రపర్వంగా తిలకించిన భక్తులు భక్తిపరవశంతో పులకించారు.
పిట్స్‌బర్గ్‌లో ముగిసిన ఆగమశాస్త్ర సదస్సు:
అమెరికాలోని పిట్స్‌బర్గ్‌లో గల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో రెండు రోజుల పాటు జరిగిన ఆగమశాస్త్ర సదస్సు ఆదివారం ఘనంగా ముగిసింది. ఆచారాలలో వేదాల ఔచిత్యం అనే అంశంపై శ్రీ.కె.పురుషోత్తమాచార్యులు , ఉత్సవవిధి అంశంపై శ్రీ.కె.శ్రీనివాసాచార్యులు , ప్రతిష్ట – సంప్రోక్షణ అంశంపై శ్రీ.కె.హెచ్.రాజేష్ కుమార్ మాట్లాడారు.
ఇందులో అమెరికాలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయాల్లో తిరుమల శ్రీవారి ఆలయం తరహాలో ఆగమశాస్త్రబద్ధంగా పూజలు నిర్వహణ కోసం టిటిడి ఆగమ పండితులు పలు సూచనలు చేశారు. ఆగమశాస్త్రాన్ని మంచి ఫలితాలు కలుగుతాయని పండితులు పేర్కొన్నారు.
ఈ సదస్సులో టిటిడి తిరుపతి జెఇఓ శ్రీ పోల భాస్కర్, డెప్యూటీ ఇఓ శ్రీమతి గౌతమి, ఆగమ పండితులు శ్రీ శ్రీనివాసాచార్యులు, శ్రీ పురుషోత్తమాచార్యులు, శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ నిర్వాహకులు శ్రీ సుబ్బారెడ్డి, శ్రీ విజయ్ రెడ్డి, శ్రీ సుబ్బారావు చెన్నూరి, శ్రీ వేంకటాచారి, అమెరికాలోని పలు రాష్ట్రాల్లో గల పలు శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయాల అర్చకులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.
By TTD News September 30, 2018 at 08:05PM
Read More




No comments