Breaking News

డిసెంబరు నాటికి అందరికీ టీకా.. ధరల వ్యత్యాసంపై కేంద్రానికి సుప్రీం పలు ప్రశ్నలు


దేశంలోని 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కళ్లకూ ఈ ఏడాది చివరి నాటికి వ్యాక్సిన్ అందజేయాలని ఆశిస్తున్నట్టు సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం సోమవారం తెలియజేసింది. కానీ, కేంద్రం, రాష్ట్రాలు, ప్రయివేట్ ఆస్పత్రులకు వేర్వేరు ధరలకు టీకాలు అమ్మకంపై సందేహాలు వ్యక్తం చేసింది. జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎల్ఎన్ రావు, జస్టిస్ ఎస్ఆర్ భట్‌ల ధర్మాసనానికి సొలిసిటర్ జనరల్ తుషాప్ మెహతా వివరాలను అందజేశారు. సీరమ్ ఇన్‌స్టిట్యూట్, భారత్ బయోటెక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ వంటి దేశీయ సంస్థలు ఉత్పత్తి చేసిన టీకాలను దేశంలోని అర్హులైన మొత్తం ప్రజలకు డిసెంబరు చివరినాటికి అందజేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ వ్యాక్సినేషన్ విధానంపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ఇప్పటి వరకూ వ్యాక్సినేషన్ పాలసీ పత్రాలను మేం చూడలేదు.. టీకా వేర్వేరు ధరలపై ప్రభుత్వం ఏం ఆలోచిస్తోంది.. కేంద్రం ఒక ధరకు.. అంతకంటే ఎక్కువ ధరకు రాష్ట్రాలకు.. ప్రయివేట్ ఆస్పత్రులకు మరింత అధికంగా అందజేస్తున్నారు.. టీకా ఉత్పత్తి సంస్థలకే ధరలను నిర్ణయించే అధికారం ఎందుకు వదలిపెట్టారు? రాష్ట్రాలు, మున్సిపల్ కార్పొరేషన్లు వ్యాక్సిన్ల కొనుగోలుకు గ్లోబల్ టెండర్లకు ఎందుకు వెళుతున్నాయి?’’ అని ప్రశ్నించింది. రెండున్నర గంటల పాటు సుదీర్ఘంగా సాగిన విచారణలో కేంద్రానికి పలు ప్రశ్నలను సంధించిన ధర్మాసనం.. దీనిపై రెండు వారాల్లోగా అఫిడ్‌విట్ దాఖలుచేయాలని సూచింది. సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపిస్తూ.. ఈ విధానానికి రాష్ట్రాలు లిఖితపూర్వక అంగీకారం తెలిపాయని, అందరికీ టీకా ఉచితమని అన్నారు. ‘‘అఫిడవిట్‌లో ఏమున్నప్పటికీ విధాన నిర్ణయాలను తెలియజేస్తూ సంబంధిత ఫైల్ నోటింగ్‌లతో సహా పాలసీ, దాని వెనుక ఉన్న ఆలోచనలను కేంద్ర ప్రభుత్వం కోర్టు ముందు ఉంచాలి. అందరికీ ఉచిత టీకా అనే 1978 విధాన నిర్ణయాన్ని ఎందుకు విస్మరించారు? ఈ సమయంలో మేము చూస్తున్న ఏకైక సమస్య టీకా’’ అని జస్టిస్ రవీందర్ భట్ ఘాటుగా వ్యాఖ్యానించారు. జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 భారత్‌ను రాష్ట్రాల సమాఖ్య అని పేర్కొంది. ‘‘రాజ్యాంగం ఆజ్ఞాపించినప్పుడు, జాతీయ సంక్షోభ సమయంలో భారత ప్రభుత్వం, తమను తాము రక్షించుకోవాలని రాష్ట్రాలను కోరడం కంటే వ్యాక్సిన్‌ను సేకరించి వాటిని రాష్ట్రాలకు పంపిణీ చేయాలి. ప్రస్తుత విధానం వల్ల పేద రాష్ట్రాల్లో నివసించే పౌరులకు ఇబ్బందులుంటాయని, ఆ రాష్ట్రాలు అవసరమైన వ్యాక్సిన్లను కూడా సేకరించలేవు’’ అని వ్యాఖ్యానించారు. 45 ఏళ్లు దాటినవారికే కేంద్రం ఉచితంగా టీకా ఇవ్వడంపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. 18 ఏళ్లు నిండినవారికి రాష్ట్రాలే కొనుగోలు చేయడం ఏంటని పేర్కొంది. ‘దేశంలో 18-45 ఏళ్లలోపు వ్యక్తులు 60 కోట్ల మంది ఉన్నారని, వీరిలో 50% ప్రైవేట్ ఆసుపత్రులకు వెళుతున్నారు. వీరంతా ప్రైవేట్ ఆసుపత్రులలో ఛార్జీలు భరించగలరా? అస్సలు కుదరదు’ అని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. టీకా కోసం కొవిన్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ సందర్భంగా ఎదురవుతున్న ఇబ్బందులను కూడా ధర్మాసనం ప్రస్తావించింది.


By June 01, 2021 at 08:06AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/covid-vaccine-for-all-by-december-centre-told-to-supreme-court/articleshow/83134408.cms

No comments