Breaking News

ఎర్రకోటపై జెండా ఎగరేసి ఏం సాధించాం.. రైతు సంఘాల్లో చిచ్చు


ర్రకోటపై రైతు జెండాలు ఎగరవేసిన ఘటన కర్షక సంఘాల్లో చిచ్చురేపాయి. హింసాత్మక ఘటనల అనంతరం విడిపోయాయి. ఆందోళనల నుంచి వైదొలుగుతున్నట్టు రెండు రైతు సంఘాలు ప్రకటించాయి. ఇతర సంఘాల నేతలపై ఆరోపణలు గుప్పించాయి. కొన్ని రైతు సంఘాలు ఇతరులు చెప్పినట్టు పనిచేస్తున్నాయని ఆరోపించాయి. ట్రాక్టర్ల పరేడ్‌లో చోటు చేసుకున్న ఘటనలు తీవ్రంగా బాధించాయని పేర్కొన్నారు. ట్రాక్టర్ల ర్యాలీ సందర్భంగా ఢిల్లీలో అల్లర్ల ఘటన అనంతరం జరిగిన కీలక పరిణామాలివి.. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొన్ని నెలలుగా చేస్తున్న ఆందోళనల నుంచి తప్పుకొంటున్నట్టు రాష్ట్రీయ కిసాన్‌ మజ్దూర్‌ సంఘటన్‌ (RKMS) కన్వీనర్‌ సర్దార్‌ వీఎం సింగ్‌ ప్రకటించారు. భారతీయ కిసాన్‌ యూనియన్‌ (భాను) కూడా ఇదే తరహా ప్రకటన చేసింది. ‘నిన్న ఢిల్లీలో జరిగిన ఘటనలు బాధించాయి. ఇతరుల ఆధ్వర్యంలో నిరసన కొనసాగించలేం’ అని వీఎం సింగ్ అన్నారు. అనుమతి ఇచ్చిన సమయం కంటే ముందే ర్యాలీ ప్రారంభించడం వల్లే ఉద్రిక్తతలు తలెత్తాయని ఆయన చెప్పారు. ర్యాలీని ఇతర మార్గాల్లో ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చిందని సింగ్ ప్రశ్నించారు. రాకేశ్‌ తికాయత్‌ లాంటి నేతల వైఖరితోనే రైతుల ఉద్యమానికి మచ్చ ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్రకోటపై జెండా ఎగురవేసి ఏం సాధించామని వీఎం సింగ్ ప్రశ్నించారు. ఎర్రకోటపై ఎగిరే త్రివర్ణ పతాకం మన పూర్వీకుల త్యాగఫలమని అన్నారు. ‘నిన్న జరిగిన ఘటనల వల్లే ఉద్యమం నుంచి తప్పుకొంటున్నాం. రైతులు దెబ్బలు తినడానికో, చనిపోవడానికో ఇక్కడికి రాలేదు. హక్కులు సాధించుకొనేందుకే వచ్చారు. రైతు హక్కుల కోసం, మద్దతు ధర సాధన కోసం మా పోరాటం కొనసాగుతుంది’ అని సింగ్ పేర్కొన్నారు. తాము కూడా ఆందోళనల నుంచి వైదొలుగుతున్నట్టు బీకేయూ అధ్యక్షుడు భాను ప్రతాప్‌ సింగ్‌ ప్రకటించారు. ట్రాక్టర్ల ర్యాలీ సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలు తమను తీవ్రంగా బాధించాయన్నారు. భాను వర్గం చిల్లా వద్ద 58 రోజులుగా ఆందోళనలు కొనసాగిస్తోంది. మరోవైపు.. ట్రాక్టర్ల ర్యాలీ సందర్భంగా ఢిల్లీలో జరిగిన విధ్వంసానికి సంబంధించి 200 మంది నిందితులను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. వారందరినీ అరెస్టు చేస్తామని ప్రకటించారు.


By January 27, 2021 at 06:51PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/two-farmer-unions-withdraw-from-protest-after-delhi-violence-on-jan-26/articleshow/80482559.cms

No comments