Breaking News

మహారాష్ట్రలో బీజేపీ ఝలక్.. ఎన్సీపీలోకి సీనియర్ నేత ఏక్‌నాథ్ ఖడ్సే


మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌‌పై గత కొద్ది రోజులుగా విమర్శలు గుప్పిస్తోన్న సీనియర్ నేత ఎట్టకేలకు పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఫడ్నవీస్ తన జీవితాన్ని నాశనం చేశారని, దాదాపు నాలుగేళ్లు తాను మానసిక క్షోభకు గురైనట్లు ఆయన ఆరోపించారు. తనను పార్టీ నుంచి తొలగించాలని ఫడ్నవీస్ పలుసార్లు ప్రయత్నించారని, బీజేపీని వీడటం బాధాకరమే అయినప్పటికీ తనకు మరో దారి లేదన్నారు. బీజేపీ నుంచి బయటకొచ్చిన ఏక్‌నాథ్.. ఎన్సీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. అటు, ఖడ్సే నిర్ణయాన్ని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్వాగతించారు. తన సేవలను బీజేపీ గుర్తించలేదని, తన సేవలను గుర్తించే పార్టీలో చేరాలని భావించడంలో ఎలాంటి తప్పు లేదని ఖడ్సే నిర్ణయాన్ని పవార్ సమర్థించారు. నవరాత్రి ఉత్సవాల తొలి రోజే ఎన్సీపీలో చేరడానికి ముహూర్తం ఫిక్స్ అయ్యిందని ప్రచారం జరిగింది. కానీ... వివిధ కారణాల రీత్యా అది శుక్రవారానికి మారినట్లు సమాచారం. ఉత్తర మహారాష్ట్ర జలగావ్ జిల్లాకు చెందిన ఏక్‌నాథ్ ఖడ్సే.. రాష్ట్రంలోని బీజేపీ కీలక నేతల్లో ఒకరు. ముఖ్యంగా ఉత్తర మహారాష్ట్రలో బీజేపీ బలోపేతానికి ఖడ్సే విశేషంగా కృషిచేశారు. దివంగత నేత గోపీనాథ్ ముండేతో కలిసి పనిచేసిన ఖడ్సే.. బీజేపీ-శివసేన తొలి ప్రభుత్వంలో ఆర్ధిక, ఉన్నత విద్య, జలవనరుల శాఖ మంత్రిగా పనిచేశారు. ఇక, 2009-2014 వరకు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీ-సేన ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడంతో రెవెన్యూ మంత్రిగా ఫడ్నవిస్ క్యాబినెట్‌లో బాధ్యతలు చేపట్టారు. వాస్తవానికి ముఖ్యమంత్రిగా తనకే అవకాశం లభిస్తుందని ఖడ్సే భావించినా.. అనూహ్యంగా దేవేంద్ర ఫడ్నవీస్‌ను అధిష్ఠానం ఎంపికచేసింది. ప్రభుత్వంలో నెంబరు టూగా ఉన్న ఖడ్సే.. సీఎం ఫడ్నవీస్ మధ్య కోల్డ్‌వార్ మొదలయ్యింది. అవినీతి ఆరోపణలు రావడంతో 2016లో మంత్రిపదవికి రాజీనామా చేశారు. దీనిపై విచారణకు బీజేపీ ప్రభుత్వం జ్యుడీషియల్ కమిటీ వేసినా.. నివేదికను మాత్రం బయపెట్టలేదు. తనపై చేసిన ఆరోపణలు రుజువుకాలేదని.. తనను రాజకీయంగా దెబ్బకొట్టడానికే ఫడ్నవీస్ కుట్రపన్నారని ఖడ్సే దుయ్యబట్టారు. పార్టీపై బాహటంగానే విమర్శలు గుప్పించడంతో 2019 ఎన్నికల్లో ఆయనకు బీజేపీ టిక్కెట్ నిరాకరించింది. తనకు ఎమ్మెల్సీగా అయినా అవకాశం కల్పిస్తుందని ఏడాది కాలం వేచిచూసినా చివరికు మొండిచేయి చూపారు. దీంతో తీవ్ర నిరాశకు గురయిన ఆయన బీజేపీ నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నారు. అప్పటి నుంచి ఎన్సీపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఖడ్సే రాకతో ఉత్తర మహారాష్ట్రలో ఎన్సీపీ ప్రయోజనం కలుగుతుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఆ ప్రాంతంలో ఛగన్ భుజ్‌బల్ తప్ప బలమైన నేతలు లేకపోవడంతో ఖడ్సే చేరిక ఉపకరిస్తుందని, ఓబీసీ వర్గాలను తమవైపు తిప్పుకోవచ్చని ఎన్సీపీ భావిస్తోంది.


By October 22, 2020 at 11:54AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/senior-leader-eknath-khadse-quits-ncps-gain-but-is-it-bjps-loss-in-maharashtra/articleshow/78803227.cms

No comments