Breaking News

శ్రీనగర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు తీవ్రవాదులు హతం


జమ్మూ కశ్మీర్‌లో మరోసారి భద్రత దళాలు, ఉగ్రవాదులు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. శ్రీనగర్‌లోని బటమలూ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్టు అధికారులు తెలిపారు. బటమలూలో ఉగ్రవాదులున్నారనే సమాచారంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో తనిఖీలు చేపట్టింది. ఈ సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో సైన్యం అప్రమత్తమయ్యింది. సైన్యం ఎదురుకాల్పులు జరపడంతో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్టు కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. సీఆర్పీఎఫ్, పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమైనట్టు ప్రకటించిన అధికారులు, తర్వాత మరో ఇద్దర్ని మట్టుబెట్టినట్టు తెలిపారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని, పూర్తి వివరాలను కాసేపట్లో వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఉగ్రవాదులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. మరోవైపు, సరిహద్దుల్లో పాక్ ఆగడాలు రోజు రోజుకూ శ్రుతిమించుతున్నాయి. ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో 778 కిలోమీటర్ల పొడవునా ఎల్ఓసీ వెంబడి పాకిస్థాన్ కాల్పుల విరమణ ఉల్లంఘన ఇప్పటికే గత 17 ఏళ్ల అన్ని రికార్డులను అధిగమించింది. అలాగే జమ్మూ కశ్మీర్‌లో 198 కిలోమీటర్ల పరిధిలోని అంతర్జాతీయ సరిహద్దులు వెంబడి మరో 242 కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆర్మీ వెల్లడించిన వివరాల ప్రకారంలో 2017లో 971సార్లు, 2018లో 1,629సార్లు కాల్పలు ఉల్లంఘనకు పాల్పడిన పాక్.. 2019లో ఆర్టికల్ 370 రద్దు, బాలాకోట్ వైమానిక దాడుల తర్వాత రికార్డుస్థాయిలో 3,168 సార్లు పాకిస్థాన్ సైన్యం కాల్పులు జరిపింది. ప్రస్తుతం గతేడాది సంఖ్య తొమ్మిది నెలల్లోనే దాటేయడం గమనార్హం.


By September 17, 2020 at 09:22AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/three-terrorists-neutralised-in-encounter-with-security-forces-in-batamaloo-area-of-srinagar/articleshow/78159555.cms

No comments