Breaking News

మరో 15 ఏళ్లపాటు చైనా అధ్యక్ష పీఠంపై జిన్‌పింగ్.. దీర్ఘకాలిక ప్రణాళిక ఆమోదంతో లైన్ క్లియర్


చైనా అధ్యక్షుడు మరో 15 ఏళ్ల పాటు ఆ పదవిలో కొనసాగేందుకు మార్గం సుగమమైంది. జిన్‌పింగ్ రూపొందించిన 14వ పంచవర్ష ప్రణాళిక విజన్ 2035కు అధికార కమ్యూనిస్ట్ పార్టీ (సీపీసీ) ఆమోద ముద్ర వేసింది. దీంతో ఆయన పదవికి మరో 15 ఏళ్లు ఎటువంటి ఢోకా ఉండబోదని కమ్యూనిస్ట్ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. 2021-2035 మధ్య దేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధి కోసం రూపొందించిన ఈ దీర్ఘకాలిక ప్రణాళికపై నాలుగు రోజులపాటు జరిగిన పార్టీ ప్లీనరీ సదస్సులో విస్తృతంగా చర్చించారు. దేశం పూర్తిస్థాయిలో స్వయం సమృద్ధిని సాధించేందుకు, దిగుమతుల్ని పూర్తిగా తగ్గించి స్వదేశీ మార్కెట్‌ను ప్రోత్సహించేలా రూపొందించిన పంచవర్ష ప్రణాళికకు సదస్సు చివరి రోజైన గురువారం ఆమోదించారు. చైనా అధ్యక్షుడిగా జి జిన్‌పింగ్ జీవితకాలం కొనసాగేందుకు ఆ దేశ పార్లమెంట్ 2018 మార్చిలోనే ఆమోద ముద్ర వేసిన విషయం తెలిసిందే. మావో, డెంగ్ తరహాలోనే జిన్‌పింగ్ విశిష్ట నేతగా ఎదిగారు. ప్రస్తుతం రెండోసారి అధ్యక్షుడిగా కొనసాగుతున్న జిన్‌పింగ్ పదవీకాలం 2022లో ముగియనుంది. ఈ నేపథ్యంలో విజన్ 2035కు గ్రీన్ సిగ్నల్ లభించడం ద్వారా మరో 15 ఏళ్లపాటు పదవిలో కొనసాగే అవకాశం ఉంది. అధ్యక్ష పీఠంపై పదేళ్లు మాత్రమే కొనసాగాలనే పరిమితిని ఎత్తివేస్తూ.. రాజ్యాంగ సవరణ చేయగా.. చైనా పార్లమెంట్ ఆమోద ముద్ర వేసింది. 14 ఏళ్ల తర్వాత చైనా రాజ్యాంగాన్ని సవరించడం అదే తొలిసారి కావడం గమనార్హం. జిన్‌పింగ్ తొలిసారిగా 2012లో కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు. ఆయన కంటే ముందు అధ్యక్షుడిగా నియమితులైన ఇద్దరు నేతలు నిబంధనలకు అనుగుణంగా రెండు పర్యాయాల గడువు ముగిసిన వెంటనే తప్పుకున్నారు. అధ్యక్ష బాధ్యతలతోపాటు.. చైనా కమ్యూనిస్టు పార్టీ(సీపీసీ) చీఫ్‌‌గా, సెంట్రల్‌ మిలటరీ కమిషన్‌ చైర్మన్‌‌గానూ జిన్‌పింగ్ కొనసాగుతున్నారు. రాజ్యాంగ సవరణతో మరణించే వరకూ ఆయనే ఆ దేశ అధ్యక్ష పీఠంపై కొనసాగే అవకాశం దక్కింది. గతంలో మావో జెడాంగ్ మాత్రమే చైనా శాశ్వత అధ్యక్షుడిగా కొనసాగారు. ఆయన 1949 నుంచి 1976 వరకు చైనాను పాలించారు. తర్వాతి కాలంలో ఏ ఒక్కరూ సుదీర్ఘ కాలంపాటు అధ్యక్ష స్థానంలో కొనసాగొద్దనే ఉద్దేశంతో.. డెంగ్ జియాపింగ్ 35 ఏళ్ల క్రితం ‘రెండు పర్యాయాలు మాత్రమే అధ్యక్ష పదవి చేపట్టాల’నే నిబంధన తీసుకొచ్చారు.


By October 31, 2020 at 10:44AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/president-xi-jinping-rolls-out-vision-for-china-in-2035-sparks-buzz-about-his-future-role/articleshow/78964646.cms

No comments