Breaking News

ఆక్స్‌ఫర్డ్ టీకా ఆగిపోవడానికి కారణం అదే.. మా వ్యాక్సినే సురక్షితమైంది: రష్యా వ్యాఖ్యలు


ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ- ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్‌ క్లినికల్ ట్రయల్స్ బ్రిటన్‌లో తాత్కాలికంగా నిలిచిపోవడంపై రష్యా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వ్యాక్సిన్ అభివృద్ధికి అవలంభించిన విధానంలో లోపాలను ఇది ఎత్తిచూపిందని రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌(ఆర్‌డీఐఎఫ్‌) సీఈఓ కిరిల్ దిమిత్రియేవ్ కీలక వ్యాఖ్యానించారు. విస్తృత స్థాయిలో ఉపయోగించాల్సిన ఓ వ్యాక్సిన్‌ అభివృద్ధి కోసం ఆయా దేశాలు సరికొత్త, గతంలో పరీక్షించని విధానాల్ని అనుసరిస్తున్నాయని తెలిపారు. కోతుల అడినోవైరస్‌ వెక్టార్‌ను వాడటం, ఎంఆర్‌ఎన్‌ఏ సాంకేతికతను వినియోగించడం కొత్త విధానాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఏదేమైనా ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ ప్రయోగాలు తిరిగి ప్రారంభం కావడంపై ఆర్‌డీఐఎఫ్‌ సంతోషం వ్యక్తం చేశారు. అయితే, తాము అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌-వీ వ్యాక్సిన్‌ మాత్రం అందుకు భిన్నమని దిమిత్రియేవ్ పేర్కొన్నారు. వ్యాక్సిన్ అభివృద్ధిలో మానవుల అడినో వైరస్‌ వెక్టార్‌ను వినియోగించామని, అందువల్లే స్పుత్నిక్‌-వీ అత్యంత సురక్షితమైందని ఉద్ఘాటించారు. ఇక, 2020-21లో 100 కోట్ల మందికి ఈ వ్యాక్సిన్‌ను అందజేయనున్నట్లు రష్యా వార్తా సంస్థ ఇంటర్‌ఫ్యాక్స్‌ వెల్లడించింది. మరోవైపు, స్పుత్నిక్-వీ ఎగుమతికి ఆర్‌డీఐఎఫ్‌ రెండు ఒప్పందాలు కుదుర్చుకుంది. అటు, బ్రెజిల్‌లోనూ మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభించేందుకు అంగీకరించింది. ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ క్లినికల్ ట్రయల్స్ నిలిచిపోవడంతో ఫార్మా సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఒకవేళ టీకా ఉత్పత్తి నిలిచిపోతే.. కొనుగోలుకు ముందుకు వచ్చిన సంస్థలకు పూర్తి నష్టపరిహారం చెల్లించాలనే డిమాండ్‌ వినిపించింది. దీనిపై స్పందించిన ఆర్‌డీఐఎఫ్‌.. రష్యా అలాంటి విధానాన్ని అవలంబించబోదని స్పష్టం చేసింది. స్పుత్నిక్‌-వీతో సహా తమ వ్యాక్సిన్లన్నీ అత్యంత సురక్షితమైనవని తేలిందని పేర్కొంది. బ్రెజిల్‌ బహియా రాష్ట్రానికి 50 మిలియన్ల వ్యాక్సిన్ డోసుల అమ్మకానికి ఒప్పందం కుదిరిందని ఆర్డీఐఎఫ్ ప్రకటించింది. అయితే, బహియా గవర్నర్ రుయ్ కోస్టా మాత్రం కేవలం 500 డోసుల కోసమే గతవారం ఆర్డీఐఎఫ్‌తో ఒప్పందం కుదిరినట్టు తెలిపారు. ఇదిలా ఉండగా.. తాత్కాలికంగా నిలిచిపోయిన ఆక్స్‌ఫర్డ్‌ కరోనా వ్యాక్సిన్‌ ప్రయోగాలు శనివారం పునఃప్రారంభమైన విషయం తెలిసిందే. వ్యాక్సిన్‌ ఇచ్చిన ఓ వాలంటీర్‌ అనారోగ్యానికి గురికావడంతో ప్రయోగాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే ఇంతవరకు జరిగిన ప్రక్రియ అంతా సురక్షితమేనని ఔషధ ఆరోగ్య నియంత్రణ సంస్థ ధ్రువీకరించడంతో మళ్లీ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించారు. డీసీజీఏ నుంచి అనుమతి వచ్చాక భారత్‌లో ప్రయోగాలను పునఃప్రారంభిస్తామని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా తెలిపింది.


By September 13, 2020 at 12:39PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/unlike-astrazeneca-vaccine-sputnik-v-is-based-on-a-well-studied-platform-says-rdif-ceo/articleshow/78087178.cms

No comments