Breaking News

వెంటాడిన దురదృష్టం.. 700 కిలోమీటర్లు ప్రయాణించి 10 నిమిషాల ఆలస్యం వల్ల నీట్ రాయలేకపోయాడు


నీట్ కోసం ఏడాది పాటు కష్టపడి చదివి, ఏకంగా 700 కిలోమీటర్ల ప్రయాణించిన ఓ విద్యార్ధి 10 నిమిషాలు ఆలస్యం కావడంతో పరీక్షను రాయలేకపోయాడు. దీంతో అతడు తీవ్ర నిరాశలో కూరుకుపోయాడు. నీట్‌లో అర్హత సాధించి మెడిసిన్ చేయాలనే అతడి కల ఆవిరయ్యింది. వివరాల్లోకి వెళ్తే బిహార్‌లోని దర్బాంగాకు చెందిన సంతోష్‌ కుమార్‌ యాదవ్‌ ఆదివారం నిర్వహించిన నీట్‌-2020ను రాయాల్సి ఉంది. పశ్చిమ్ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో పరీక్ష కేంద్రం కావడంతో దర్బాంగా నుంచి రెండు బస్సుల్లో ఒక రోజంతా ప్రయాణించాడు. ఆదివారం మధ్యాహ్నం 2.00 గంటలకు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా.. ఎంత ప్రయత్నించినా అతడికి శనివారం వరకూ బస్సు లభ్యం కాలేదు. ఎట్టకేలకు టికెట్‌ దొరకడంతో శనివారం ఉదయం 8.00 గంటలకు దర్బాంగా నుంచి ముజఫర్‌పూర్ బస్సు ఎక్కాడు. అక్కడ నుంచి పట్నాకు మరో బస్సులో బయలుదేరగా దురదృష్టం వెంటాడింది. ఆ బస్సు ట్రాఫిక్‌ జామ్‌లో 6గంటల పాటు ఇరుక్కుపోయింది. చివరకు పట్నాకు చేరుకుని శనివారం రాత్రి 9 గంటలకు కోల్‌కతాకు మరో బస్సులో బయలుదేరాడు. ఆదివారం మధ్యాహ్నం కోల్‌కతాకు చేరి, క్యాబ్‌ బుక్‌ చేసుకుని సాల్ట్ లేక్ వద్ద పరీక్ష కేంద్రానికి వెళ్లాడు. కానీ, అప్పటికే సమయం మించిపోయింది. లోపలికి అనుమతించే సమయం 1.30 గంటలు కాగా.. 1.40గంటలకు సెంటర్‌కు చేరుకున్నాడు. 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చావంటూ అధికారులు అతడిని అనుమతించలేదు. వారిని కాళ్లావేళ్లా పడి బతిమాలినా అనుమతించకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. 10 నిమిషాల ఆలస్యం వల్ల మరో ఏడాది కోల్పోయానని వాపోయాడు.


By September 15, 2020 at 08:06AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/a-boy-from-bihars-dharbanga-travels-700-kms-to-reach-neet-exam-centre-misses-it-by-10-minutes/articleshow/78117448.cms

No comments