Breaking News

జగన్, కేసీఆర్‌‌పై ఇప్పటికీ తగ్గని సోనియా కోపం? చతురత మరచి, చేజారిన ఛాన్స్..!


రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరనేది.. పాలిటిక్స్ గురించి అవగాహన ఉన్నవారు తరచుగా చెప్పే మాట. కాంగ్రెస్‌కు పోటీగా ఏర్పాటై.. ఆ పార్టీకి బద్ధ విరోధిగా ఉన్న టీడీపీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హస్తంతో ఎలా దోస్తీ కట్టిందో మనం చూశాం. అంతే కాదు.. హిందూత్వమే ఊపిరిగా ఏర్పాటైన శివసేన.. ఉద్దవ్ థాక్రేను సీఎం పీఠం మీద కూర్చోబెట్టడమే లక్ష్యంగా.. బీజేపీని వదిలేసి ఎన్సీపీ, కాంగ్రెస్‌ పంచన చేరింది. కానీ అప్పటికే నుంచి బయటకొచ్చిన వైఎస్ జగన్ మాత్రం ఇప్పటికీ కాంగ్రెస్ అధిష్టానానికి బద్ధ శత్రువుగా కనిపిస్తున్నారు. సెప్టెంబర్‌లో నిర్వహించనున్న నీట్, జేఈఈ ప్రవేశ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ.. కాంగ్రెస్ నాయకత్వంలో విపక్షాలకు చెందిన సీఎంలు భేటీ అయిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటు ఆ పార్టీ మద్దతుతో ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన ఉద్ధవ్ థాక్రే, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. బీజేపీ పొడ ఏమాత్రం గిట్టని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. మొత్తం ఏడు రాష్ట్రాల సీఎంలు ఈ భేటీకి హాజరై సుప్రీం కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌లను ఆహ్వానించినా.. ఏవో కారణాలు చెప్పి వారు సమావేశానికి దూరంగా ఉన్నారని సమాచారం. కానీ ఈ సమావేశానికి బీజేపీయేతర పార్టీలకు చెందిన కొందరు సీఎంలను సైతం కాంగ్రెస్ ఆహ్వానించలేదు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, ఏపీ సీఎం వైఎస్ జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్‌లకు కాంగ్రెస్ ఆహ్వానం పంపలేదని సమాచారం. ఒడిశా సీఎం గతంలో బీజేపీతో దోస్తీ చేశారు కాబట్టి.. ఇప్పటికీ బీజేడీ, బీజేపీ శత్రువులుగా కంటే.. మిత్రపక్షంగా ఉంటాయి. కాబట్టి పట్నాయక్‌ను ఈ భేటీకి ఆహ్వానించకపోవడానికి కారణముంది. కానీ గతంలో కాంగ్రెస్‌లో పని చేసిన జగన్‌ను, తెలంగాణ ఇస్తే కాంగ్రెస్‌లో టీఆర్ఎస్‌ను విలీనం చేస్తానన్న కేసీఆర్‌ను ఈ సమావేశానికి ఆహ్వానించకపోవడం గమనార్హం. ఏపీలో కరోనా కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ.. ఆ రాష్ట్ర సీఎంను కాంగ్రెస్ పిలవలేదు. తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పతనం కావడానికి కారణమైన ఈ ఇద్దరు నేతలపై కాంగ్రెస్ అధిష్టానం.. ముఖ్యంగా ఇప్పటికీ ఆగ్రహంతో ఉండటమే దీనికి కారణంగా భావించొచ్చు. ఈ భేటీకి కాంగ్రెస్ పిలవకపోవడం వల్ల కేసీఆర్, జగన్‌లకు ఒరిగేదేం లేదు. పిలిచినా ఎలాగో వెళ్లరు కూడా. ఒక వేళ వెళ్తే మాత్రం.. భవిష్యత్తులో దోస్తీకి ఆస్కారం ఉంటుంది. రాకపోతే మేం ఆహ్వానించాం కానీ బీజేపీతో అంటకాగడం వల్లే రాలేదనే విమర్శకు ఆస్కారం ఉండేది. ఓవైపు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా కేసీఆర్ కొత్త కూటమి కడుతున్నారు కదా అంటారా..? జగన్‌కు కాంగ్రెస్‌పై ఉన్న ఆగ్రహం గురించి తెలిసిందే కదా అంటారా? కూటమి ఏదైనా సరే ఎన్నికల సమయంలోనే కదా.. మిగతా సమయాల్లో అంశాల వారీగా ప్రభుత్వాన్ని మెచ్చుకోవడం, విమర్శించడం లాంటివి చేస్తే తప్పేముంది..? తెలంగాణలో కాంగ్రెస్ ప్రతిపక్షం కాబట్టి.. కేసీఆర్‌ను సోనియా పిలిచినా వెళ్లలేదని.. బీజేపీపై దూకుడుగా విమర్శలకు కేసీఆర్ వెనుకాడుతున్నారని ఆరోపించే అవకాశాన్ని కాంగ్రెస్ కాదనుకుంది.


By August 27, 2020 at 08:53AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/kcr-and-ys-jagan-did-not-get-invitation-for-congress-meeting-on-neet-jee-exams-reports/articleshow/77775766.cms

No comments