మొదటికొచ్చిన శబరిమల వివాదం .. కేరళ సీఎం కీలక నిర్ణయం

శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళల ప్రవేశంపై సర్వోన్నత న్యాయస్థానం ఎదో ఒక స్పష్టత ఇస్తుందని అందరూ భావించినా ఈ అంశం ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. దీనిపై మరింత లోతైన విచారణ జరగాలని అభిప్రాయపడిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం.. విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. దీంతో వివాదం మొదటికొచ్చింది. శబరిమల ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళలను అనుమతించాలని పేర్కొంటూ గతేడాది సెప్టెంబరు 28న తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. కాగా, శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశంపై కేరళ ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేయనుంది. గతేడాది చోటుచేసుకున్న అలజడులను దృష్టిలో ఉంచుకుని ముందుకు వెళ్లాలని భావిస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు విషయంలో న్యాయకోవిదులను సంప్రదించాలని నిర్ణయించింది. నవంబరు 17 నుంచి మండల పూజలకు ఆలయం తెరుచుకోనుండగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మీడియాతో మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పు విషయంలో న్యాయసలహా తీసుకుంటామని వ్యాఖ్యానించారు. సుప్రీం కోర్టు ఉత్తర్వుల విషయంలో ఉన్న సందేహాలు, అనుమానాలు నివృత్తి చేసుకున్న తర్వాతే మహిళలకు ఆలయ ప్రవేశంపై నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. కోర్టు ఉత్తర్వులు ఏవైనా సరే అమలు చేసేందుకు తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని చెప్పారు. కొన్ని అంశాల విషయంలో అనుమానాలు నివృత్తి చేసుకోవాల్సి అవసరం ఉందని విజయన్ వివరించారు. గతంలో ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు ఎలాంటి స్టే విధించలేదని ఆయన గుర్తుచేశారు. కాగా, సుప్రీంకోర్టు నిర్ణయంపై అఖిల భారత శబరిమల కర్మ సమితి హర్షం వ్యక్తం చేసింది. ఇది భారతీయులు, అయ్యప్ప భక్తులు సాధించిన విజయంగా అభివర్ణించింది. సుప్రీం తీర్పును గౌరవించి మహిళలు శబరిమలలోకి వెళ్లే ప్రయత్నం విరమించుకోవాలని సూచించింది. అన్ని వయసుల మహిళల ప్రవేశంపై మరింత లోతుగా విచారణ జరగాలన్న సుప్రీంకోర్టు అభిప్రాయం సరైందేనని పేర్కొంది. కోర్టు తీర్పు సంతోషకరమని, కేరళ వ్యాప్తంగా ఆలయాల్లో దీపాలను వెలిగించి దీనిని సంబరాలు జరుపుకుంటామని శబరిమల కర్మ సమితి తెలిపింది.
By November 15, 2019 at 09:11AM
No comments