Breaking News

మహా సంక్షోభం: సుప్రీం కీలక నిర్ణయం.. బలపరీక్షపై రేపు తుది తీర్పు!


మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని గవర్నర్ ఆహ్వానించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ , కాంగ్రెస్-ఎన్‌సీపీలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుచేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆదివారం అత్యవసర విచారణ చేపట్టింది. జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత కేంద్రం, ఫడ్నవీస్, అజిత్ పవార్‌ సహా అన్ని పార్టీలకు నోటీసులు జారీచేసింది. సోమవారం తుది తీర్పును వెలువరిస్తామని స్పష్టం చేసింది. సోమవారం ఉదయం 11.30 గంటలకు తీర్పును వెలువరిస్తామని పేర్కొంది. తక్షణమే బలపరీక్ష అవసరంలేదని, సోమవారం ఉదయం 10.30 గంటలకు ఈ అంశంపై విచారణ చేపడతామని తెలిపింది. గవర్నర్‌కు ఇచ్చిన మద్దతు లేఖను కోర్టుకు అందజేయాలని ఆదేశించింది. గవర్నర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని అభిప్రాయపడింది. అంతకు ముందు కాంగ్రెస్-ఎన్‌సీపీ- శివసేన తరఫున సీనియర్ లాయర్, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్, తరఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. సంఖ్యాబలంలేని బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఎలా ఆహ్వానిస్తారని, ఎన్నికలకు ముందు ఏర్పాటైన కూటమి విచ్ఛిన్నమైందని కపిల్ సిబల్ తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్-ఎన్‌సీపీ- శివసేన కూటమిగా ఏర్పడ్డాయని, రాష్ట్రపతి పాలన తొలగించాలని గవర్నర్ సిఫార్సు చేయడం ఏంటని ప్రశ్నించారు. రాత్రికి రాత్రే నిర్ణయం తీసుకుని క్యాబినెట్ ఆమోదం లేకుండా ఎలా రాష్ట్రపతి పాలన రద్దుచేస్తారని నిలదీశారు. గవర్నర్ ఏకపక్షంగా వ్యవహరించారని, ఆయన ఎవరి డైరెక్షన్‌లో పనిచేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ ఆహ్వానానికి కనీసం లేఖ పంపకుండా, ఎమ్మెల్యేలను పిలవకుండా ఎలా ప్రమాణస్వీకారం చేస్తారని అన్నారు. బీజేపీకి బలం ఉంటే తక్షణమే నిరూపించుకోవాలని, లేదంటూ తమకు అవకాశం ఇవ్వాలని కపిల్ సిబల్ కోరారు. తక్షణమే బలనిరూపణ చేసుకోవాలని బీజేపీ ప్రభుత్వాన్ని ఆదేశించాలని అన్నారు. అజిత్ పవార్ ఎలా ప్రమాణం చేస్తారని, ఆయనకు ఏ ఎమ్మెల్యే మద్దతూ లేదని మరో సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ అన్నారు. ఎమ్మెల్యేల సంతకాలతో అజిత్ ఇచ్చిన లేఖ చెల్లదని ఆయన స్పష్టం చేశారు. తమ పార్టీకి చెందిన 41 మంది ఎమ్మెల్యేలు ఆయన వెంటలేనప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేశారని పేర్కొన్నారు. బీజేపీ తరఫున వాదనలు వినిపించిన ముకుల్ రోహత్గీ.. గవర్నర్ రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించారని అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 361ప్రకారం స్వీయనిర్ణయాధీకారం గవర్నర్‌కు ఉందని స్పష్టం చేశారు. గవర్నర్ నిర్ణయాన్ని కోర్టుల్లో సవాల్ చేయలేరని అన్నారు. అసెంబ్లీని సమావేశపరిచి, ప్రొటెం స్పీకర్‌ను నియమించి, గవర్నర్ ప్రసంగం, బలపరీక్ష జరిగేలా ఆదేశాలివ్వాలని సుప్రీంకోర్టును అభ్యర్థించారు. ఫడ్నవీస్‌ను గవర్నర్‌ అహ్వానించడంపై మూడు పార్టీలూ అభ్యంతరం తెలిపాయి. తమ కూటమికి 144 మందికిపైగా ఎమ్మెల్యేల మద్దతు ఉందని పిటిషన్‌లో పేర్కొన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ను ఆహ్వానించేలా ఆదేశాలివ్వాలని సుప్రీంకోర్టును కోరాయి. ఫడ్నవీస్‌‌ను 24 గంటల్లోగా బలం నిరూపించుకునేలా ఆదేశాలు ఇవ్వాలని తమ పిటిషన్‌లో పేర్కొన్నాయి. ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టాలని కోరగా.. సుప్రీంకోర్టు ఇందుకు అంగీకరించి విచారణ చేపట్టింది.


By November 24, 2019 at 12:39PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/sc-issues-notice-to-all-parties-and-posted-the-hearing-for-tomorrow-in-maharashtra-govt-formation-issue/articleshow/72207136.cms

No comments