Breaking News

26/11 ముంబై మారణహోమానికి 11 ఏళ్లు.. తలచుకుంటే ఇప్పటికీ వణుకే


ముంబైలో ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమానికి 11ఏళ్లు పూర్తయ్యింది. ఈ ఉదంతం ప్రపంచ ఉగ్రవాద దాడుల్లోనే అత్యంత ఘోరమైన ఘటనగా చరిత్రలో నిలిచిపోయింది. బాధితులకు ఇప్పటికీ ఓ చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది.. ఈ దాడి ప్రాణాలు కోల్పోయిన తమ కుటుంబ సభ్యుల్ని తలచుకొని బాధపడుతున్నారు. అలాగే శత్రువులతో యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వీరులకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. ‘2008లో ముంబై ఉగ్రవాద దాడి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారందరికీ నా హృదయపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. ఈ సందర్భంగా దేశాన్ని కాపాడటంలో ప్రాణత్యాగం చేసిన భద్రతా బలగాలకు నివాళులర్పిస్తున్నాను. వారి త్యాగాలను దేశం ఎన్నటికీ మరవదు’ అంటూ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అమరులకు తన నివాళులను అర్పించారు. 2008 నవంబరు 26న పాకిస్థాన్‌లోని కరాచీ రేవు నుంచి అరేబియా సముద్రం ద్వారా ముంబైలోకి లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన అజ్మల్ కసబ్, మరో తొమ్మిది మంది చొరబడ్డారు. ఒబెరాయ్ హోటల్, తాజ్, త్రపతి శివాజీ టెర్మినస్‌ల వద్ద నాలుగు రోజుల పాటు మారణహోమం సృష్టించారు. హోటల్స్‌లో ఉన్న దేశ విదేశీయులను బంధీలుగా చేసుకొని రెచ్చిపోయారు. లోపలి దాగి ఉన్న ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి భారత దళాలకు మూడు రోజులకు పైగా సమయం పట్టింది. పది మంది ఉగ్రవాదుల్లో 9 మంది చనిపోగా.. ఈ దాడిలో 166 మంది ప్రాణాలు కోల్పోగా, 300 మంది వరకు గాయపడ్డారు. ఈ దాడితో ముంబై నగరం భయంతో వణికిపోయింది. ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ లో మహారాష్ట్ర ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కారే తన ప్రాణాలను ఫణంగా పెట్టి, వీరోచితగా పోరాడి అశువులుభాసాడు. నాటి ఆ ఉదంతం యావత్ ప్రపంచాన్ని నివ్వెరపరచింది. ఈ ఆపరేషన్‌లో ప్రాణాలతో పట్టుబడ్డ అజ్మల్ కసబ్‌ను విచారించారు.. తర్వాత అతడికి మరణశిక్ష విధించారు. ఈ ఘటన జరిగిన నాలుగేళ్ల తర్వాత 2012 నవంబరులో కసబ్‌ను ఎరవాడ జైలులో ఉరి తీశారు. ముంబైలో జరిగిన ఉగ్రదాడికి వ్యూహ రచన పాకిస్థాన్ లోనే జరిగింది. దీనికి సంబంధించి ఎన్నో ఆధారాలను భారత్ బయటపెట్టింది. పాక్ దేశ మాజీ జాతీయ భద్రతా సలహాదారు మహ్మాద్ అలీ దురానీ కూడా దీనిని ధ్రువీకరించారు కూడా. కానీ దాయాదీ దేశం మాత్రం తమకు ఈ దాడితో ఎలాంటి సంబంధం లేదని ఇప్పటికీ మొండి వాదనను వినిపిస్తోంది. ఈ ఉగ్రదాడి జరిగి గతేడాదికి పదేళ్లు పూర్తి కావడంతో.. దీని సూత్రధారుల గురించి సరైన సమాచారం ఇస్తే 5 మిలియన్‌ డాలర్ల రివార్డు ఇస్తామని అగ్రరాజ్యం అమెరికా ప్రకటించింది. ఉగ్రదాడికి సూత్రదారులు, సహాయ పడినవారు, దాడికి ప్రేరేపించిన వారి వివరాలు ఏదైనా తెలియజేస్తే 5 మిలియన్‌ డాలర్లు అంటే దాదాపు రూ.35కోట్లు నజరానాగా ఇస్తామని డొనాల్డ్‌ ట్రంప్‌ యంత్రాంగం వెల్లడించింది.


By November 26, 2019 at 09:31AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/11-years-of-unforgettable-incidents-in-26-november-2008-mumbai-attacks/articleshow/72234467.cms

No comments