Breaking News

మరోసారి యూకేలో లాక్‌డౌన్.. కరోనా కట్టడికి మరో గత్యంతరం లేదన్న ప్రధాని


ఐరోపా దేశాల్లో మళ్లీ మహమ్మారి విరుచుకుపడుతోంది. దీంతో పలు దేశాలు మరోసారి లాక్‌డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియంలు లాక్‌డౌన్ ప్రకటించాయి. తాజాగా, ఈ జాబితాలో యునైటెడ్ కింగ్‌డమ్ చేరింది. మరోసారి మహమ్మారి విజృంభించడంతో లాక్‌డౌన్ విధిస్తూ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఆందోళకర స్థాయిలో వైరస్ వ్యాపించడంతో కట్టిడికి సరైన చర్యలు తీసుకోకపోతే గతం కంటే మరణాల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో మహమ్మారి కట్టడికి మరో మార్గం లేక రెండోసారి లాక్‌డౌన్ విధించారు. వచ్చే గురువారం నుంచి అమలులోకి రానున్న ఈ లాక్‌డౌన్‌ నాలుగు వారాల పాటు కొనసాగనుంది. ‘మరో ప్రత్యామ్నాయం లేదు. కఠిన చర్యలు తీసుకోవడానికి ఇదే సరైన సమయం. అందరూ ఇంటికి పరిమితం కావాల్సిందే. చదువు, ఇంటి నుంచి పని వీలుకాకపోతే ఆఫీసు, స్వల్ప వ్యాయామం, చికిత్స, ఆహారం, ఇతర నిత్యావసర కోసం తప్ప బయటకు రావొద్దు. తొలి లాక్‌డౌన్‌తో పోలిస్తే ఇది అంత కఠినంగా ఉండదు. వ్యాపారాలు, ఉద్యోగులకు ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహకాలను మరికొన్ని రోజులకు పొడిగిస్తాం’ అని ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ పేర్కొన్నారు. ‘మనం ప్రకృతి పట్ల వినయంగా ఉండాలి. శాస్త్రీయ సలహాదారులు అంచనాలకు మించి ఐరోపాలో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది.. దీనిని కట్టడి చేయడానికి ఇప్పుడు మేము చర్య తీసుకోకపోతే దేశంలో రోజూ వేలాది మరణాలు చోటుచేసుకుంటాయి.. ఇది ఏప్రిల్‌లో ఎదుర్కొన్న పరిస్థితి కంటే దారుణం’ అని బోరిస్ జాన్సన్ అన్నారు. అత్యవసరం కానీ కార్యకలాపాలన్నింటినీ నిలిపివేసి, పబ్బులు, రెస్టారెంట్లు, బార్లు తదుపరి ఆదేశాల వరకు మూసివేయలని సూచించారు. ఇంటిలో ఒకరు మాత్రమే బయటి వ్యక్తులను కలుసుకోవడానికి వీలుంటుందని, విద్యా సంస్థలు తెరిచే ఉంటాయన్నారు. వీటన్నింటినీ ప్రజలు కచ్చితంగా అమల్లో పెడితే క్రిస్‌మస్‌ నాటికి పరిస్థితులు చక్కబడే అవకాశం ఉందని బోరిస్‌ జాన్సన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో కరోనా వ్యాపిస్తున్న తీరుపై బ్రిటన్ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాప్తి ఇలాగే కొనసాగితే మరణాల రేటు, పాజిటివిటీ రేటు, కొత్త కేసుల సంఖ్య విషయంలో రెండో వేవ్ తీవ్రంగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు. యూకేలో ప్రస్తుతం కరోనా వైరస్ బాధితుల సంఖ్య ఒక్క మిలియన్ దాటింది. ఇప్పటి వరకు 10,11,660 మందికి వైరస్ నిర్ధారణ కాగా.. 46,555 మంది ప్రాణాలు కోల్పోయారు. గడచిన 24 గంటల్లో 21,915 కేసులు.. 326 మరణాలు చోటుచేసుకున్నాయి. ‘మనం ప్రకృతి పట్ల వినయంగా ఉండాలి. శాస్త్రీయ సలహాదారులు అంచనాలకు మించి ఐరోపాలో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది.. దీనిని కట్టడి చేయడానికి ఇప్పుడు మేము చర్య తీసుకోకపోతే దేశంలో రోజూ వేలాది మరణాలు చోటుచేసుకుంటాయి.. ఇది ఏప్రిల్‌లో ఎదుర్కొన్న పరిస్థితి కంటే దారుణం’ అని బోరిస్ జాన్సన్ అన్నారు.


By November 01, 2020 at 11:01AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/coronavirus-england-once-again-announces-lockdown-2-from-thursday/articleshow/78978782.cms

No comments