Breaking News

విశాఖ: ఒంటిమీద నూలుపోగు లేకుండా వచ్చి దోచుకెళ్తాడు.. దొంగ స్ట్రాటజీ వెనుక రహస్యం ఇదే


ఒంటిమీద నూలుపోగు లేకుండా ఇంట్లోకి ప్రవేశించి సొత్తు దోచుకెళ్లడం ఈ దొంగ ప్రత్యేకత. ఇలా పది ఇరవై కాదు ఏకంగా 60 చోరీలకు పాల్పడిన ఈ దొంగ పాపం పండి ఎట్టకేలకు విశాఖ పోలీసులకు చిక్కాడు. అతడితోపాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు విశాఖ-1 డీసీపీ ఐశ్వర్య రస్తోగి తెలిపారు. మీడియాతో శనివారం డీసీపీ మాట్లాడుతూ.. జులై 20న విశాలాక్షినగర్‌లోని ఆర్‌ఎస్‌ఐ ఇళ్లు, దువ్వాడ, ఎయిర్‌పోర్టు, అనకాపల్లి, కశింకోట పోలీసుస్టేషన్ల పరిధిలో వరుస చోరీలు చోటుచేసుకున్నాయని అన్నారు. ఈ ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలించి, ఓ వ్యక్తి నగ్నంగా ఇళ్లల్లోకి ప్రవేశిస్తున్నట్లు గుర్తించారు. అతడు గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన పాతనేరస్తుడు కంచర్ల మోహనరావు(40)గా నిర్ధారణకు వచ్చారు. దీంతో తుని సమపంలోని సెప్టెంబరు 11న అరెస్టు చేశారు. అతడికి సహకరించిన అనకాపల్లి మండలం తమ్మయ్యపేట వెంకుపాలెంకు చెందిన సంతోష్‌కుమార్‌నూ అదుపులోకి తీసుకున్నారు. దొంగతనం చేయాల్సిన ఇంటిని ఎంచుకుని, ఇద్దరూ కలిసి పథకం వేస్తారు. తొలుత మోహన్‌రావును సంతోష్‌ తన బైక్‌పై దొంగతనం చేసే ఇంటి వద్ద దింపుతాడు. అక్కడే మోహన్ తన ఒంటిపై బట్టలు తీసేసి ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఒక్కోసారి పూర్తిగా బట్టలు లేకుండా, ఒక్కోసారి అండర్‌వేర్ మాత్రమే ధరించి, చేతులకు గ్లౌజ్‌లు వేసుకుంటాడు. ఎవరైనా తనను నగ్నంగా చూస్తే సైకోగా భావించి, దగ్గరకు రావడానికి భయపడతారని, ఈలోగా అక్కడ నుంచి తప్పించుకోవచ్చనేది దొంగ ఆలోచనని పోలీసులు తెలిపారు. అనకాపల్లిలోని ఓ ఫైనాన్స్‌ సంస్థలో తాకట్టు పెట్టిన 20 తులాల దొంగ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు.


By September 13, 2020 at 07:51AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/visakhapatnam-police-arrested-naked-thief-who-robbery-60-houses/articleshow/78084961.cms

No comments