Breaking News

చికిత్స కోసం లండన్ వెళ్లి తిరిగిరాని పాక్ మాజీ ప్రధాని.. అరెస్ట్ వారెంట్ జారీ


ప్రస్తుతం లండన్‌లో ఉంటున్న పాక్ మాజీ ప్రధానమంత్రి అరెస్టుకు పాక్ ప్రభుత్వం తాజాగా అరెస్టు వారంట్ జారీ చేసింది. అక్రమాస్తుల కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను దోషిగా తేల్చిన న్యాయస్థానం ఆయనకు 2018 డిసెంబరులో ఏడేళ్లు జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. అయితే, అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయనను చికిత్స కోసం లండన్ వెళ్లేందుకు గతేడాది నవంబరులో లాహోర్ హైకోర్టు అనుమతించింది. అవెన్ ఫీల్డ్ ప్రాపర్టీస్, అల్ అజీజియా స్టీల్ మిల్లు కేసుల్లో నవాజ్ షరీఫ్‌ను దోషిగా తేల్చిన లాహోర్ హైకోర్టు.. శిక్షను ఖరారుచేసింది. కానీ, ఈ రెండు కేసుల్లోనూ షరీఫ్‌కు బెయిలు మంజూరు చేసిన కోర్టు.. వైద్యచికిత్స కోసం నాలుగు వారాలు లండన్ వెళ్లేందుకు అంగీకరించింది. నవాజ్ లండన్ నుంచి స్వదేశానికి తిరిగొచ్చేందుకు 8 వారాల సమయం ఇచ్చినా ఆరోగ్య సమస్యల కారణంగా అతను తిరిగి రాలేకపోయారని ఆయన తరఫున న్యాయవాది వెల్లడించారు. అత్యవసర చికిత్స కోసం లండన్ వెళ్లిన నవాజ్ అనేక సందర్భాల్లో అక్కడ బహిరంగంగా దర్శనమిచ్చారు. ఆయనలో అనారోగ్య ఛాయలేవీ లేకపోగా, ఎంతో ఉల్లాసంగా కనిపించారు. ఈ నేపథ్యంలో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను వెంటనే అప్పగించాలని బ్రిటన్‌ను పాక్ ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టులో కోరింది. నవాజ్ షరీఫ్ అరెస్టు కోసం ప్రభుత్వం పంపిన వారంట్‌ను అందుకున్నట్లు లండన్‌లోని పాక్ హైకమిషన్ కార్యాలయం వెల్లడించింది. మాజీ ప్రధాని నవాజ్‌ను సెప్టెంబరు 22న ఇస్లామాబాద్ హైకోర్టు ముందు హాజరు పర్చాలని కోర్టు అసిస్టెంట్ రిజిస్ట్రార్ విదేశాంగ శాఖ కార్యదర్శిని ఆదేశించారు. లండన్ వెళ్లే ముందు లాహోర్‌లోని కోట్ లఖ్‌పత్ జైలులో నవాజ్ శిక్ష అనుభవిస్తుండేవారు. అనారోగ్యానికి గురవడంతో బెయిల్ మంజూరు చేసి, లండన్ వెళ్లేందుకు కోర్టు అనుమతించింది. అల్-అజీజియా, అవెన్‌ఫీల్డ్ ప్రాపర్టీ కేసుల్లో అప్పీళ్ల విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ ఇటీవల నవాజ్ షరీఫ్‌ చేసిన దరఖాస్తును ఇస్లామాబాద్ హైకోర్టు కొట్టివేసింది. అనంతరం నాన్-బెయిల్‌బుల్ వారెంట్లు జారీ చేసింది.


By September 19, 2020 at 08:07AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/pakistan-government-sends-arrest-warrants-for-former-prime-minister-nawaz-sharif/articleshow/78198345.cms

No comments