Breaking News

హైదరాబాద్: విమానంలో వచ్చి దొంగతనాలు.. పోలీసులకు చిక్కిన జల్సాల దొంగ


విమానంలో వచ్చి దొంగతనాలకు పాల్పడి.. పని పూర్తయ్యాక తిరిగి వెళ్లిపోయి, ఆ సొమ్ముతో జల్సాలు చేసే దొంగ హైదరాబాద్‌ పోలీసులకు చిక్కాడు. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌‌కు వచ్చి జనసమ్మర్థం లేని ప్రాంతాలను ఎంచుకుని పట్టపగలే చోరిచేసి, పని అయిపోయాక విమానంలోనే ఢిల్లీకి వెళ్లిపోతాడు. విలాసాల దొంగను బాలానగర్‌ ఎస్‌ఓటీ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌ దుర్గ్‌ జిల్లా కుమ్హారీ పట్టణానికి చెందిన గిరి గంగాధర్‌ అలియాస్‌ గొడుగు గంగాధర్‌ (30) కొంతకాలం హైదరాబాద్‌లోని అల్వాల్‌లో ఉండేవాడు. అనంతరం నొయిడాకు మకాం మార్చాడు. పట్టపగలే ఇళ్లను కొల్లగొట్టడంలో ఆరితేరిన గంగాధర్ తన నేరాలను కప్పి పుచ్చుకునేందుకు ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. తరచూ హైదరాబాద్‌కు వచ్చి అల్వాల్‌ పరిసర ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నాడని పోలీసులు తెలిపారు. జనసమ్మర్థంలేని ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించి తాళాలు వేసి ఉండే ఇళ్లలోకి చొరబడి బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు, నగదు దొంగిలించి, తన పని పూర్తికాగానే విమానంలో తిరిగి వెళ్లిపోయేవాడు. ఎట్టకేలకు అతడిని పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 40 తులాల బంగారు నగలు, కిలో వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.


By September 19, 2020 at 09:29AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-held-in-hyderabad-who-hailed-from-delhi-through-flight-for-robberies/articleshow/78198919.cms

No comments