Breaking News

భారత్‌లో ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్.. సానుకూల ఫలితం!


ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన కొవిడ్‌ వ్యాక్సిన్‌ ‘కొవిషీల్డ్‌’ రెండో దశ క్లినికల్ ట్రయల్స్ భారత్‌లో పుణేకు చెందిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ప్రారంభించిన విషయం తెలిసిందే. రెండో దశ ప్రయోగాల్లో భాగంగా పుణెకు చెందిన భారతి విద్యాపీఠ్‌ మెడికల్ కాలేజీ ఆసుప్రతిలో బుధవారం ఇద్దరు వాలంటీర్లకు ఇచ్చారు. ఈ వ్యాక్సిన్‌ డోసు ఇచ్చిన ఇద్దరి ఆరోగ్యం, శరీర పనితీరు చక్కగా ఉన్నట్టు వైద్యులు ధ్రువీకరించారు. వీరి పరిస్థితి సాధారణంగా ఉన్నట్టు భారతీ విద్యాపీఠ్ డిప్యూటీ మెడికల్ డైరెక్టర్ వెల్లడించారు. అలాగే, గురువారం ఇదే ఆస్పత్రిలోని మరో ముగ్గురు వాలంటీర్లకు, కెమ్‌ ఆసుపత్రి రీసెర్చ్‌ సెంటర్‌లో మరో ఇద్దరికి వ్యాక్సిన్‌ డోస్ అందించారు. ‘‘సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఉత్పత్తి చేసిన మొదటి డోసును... తొలుత 32, 48 ఏళ్ల వయసున్న ఇద్దరు వ్యక్తులపై ప్రయోగించాం.. వారిద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. నొప్పి, జ్వరం, దుష్ప్రభావాలు, ఇతరత్రా అనారోగ్య సూచనలేమీ కనిపించలేదు. అరగంట పాటు వారిని పరిశీలనలో ఉంచి, అనంతరం ఇంటికి పంపాం. వారిని ఎప్పటికప్పుడు మా సిబ్బంది సంప్రదిస్తూనే ఉన్నారు’ అని భారతి విద్యాపీఠ్‌ డిప్యూటీ మెడికల్‌ డైరెక్టర్‌ జితేంద్ర ఓస్వాల్‌ పేర్కొన్నారు. నెల రోజుల తర్వాత వారికి మరో డోసు వ్యాక్సిన్‌ అందజేయనున్నట్టు ఆయన వివరించారు. క్లినికల్ ట్రయల్స్ కోసం ఎంపికచేసిన మొత్తం 25 మంది వాలంటీర్లకు వచ్చే వారం రోజుల్లో వ్యాక్సిన్ డోస్ ఇవ్వనున్నట్టు తెలిపారు. బుధవారం దాదాపు ఐదుగురుకి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించినట్టు భారతీ విద్యా పీఠ్ మెడికల్ కాలేజీ రిసెర్చ్ విభాగం ఇంఛార్జ్ డాక్టర్ సోనాలీ పాల్కర్ అన్నారు. క్లినికల్ ట్రయల్‌లో భాగంగా వారికి వ్యాక్సిన్‌ను అందించే నిర్ణయం కోవిడ్ -19, యాంటీబాడీ పరీక్ష నివేదికలకు లోబడి ఉంటుందని అన్నారు. ప్రపంచంలోనే పెద్ద సంఖ్యలో వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థగా గుర్తింపు పొందిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా... ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెన్‌కా సంయుక్తంగా అభివృద్ధి చేసిన కొవిడ్‌ వ్యాక్సిన్‌‌ను భారత్‌లో ఉత్పత్తి చేయడానికి ఒప్పందం చేసుకుంది.


By August 28, 2020 at 06:24AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/oxford-university-covid-vaccine-trail-vital-signs-of-volunteers-normal-says-doctor/articleshow/77795193.cms

No comments