Breaking News

చైనాలో కుప్పకూలిన రెస్టారెంట్ భవనం.. 29 మంది మృతి


చైనా ఉత్తర ప్రావిన్సులు షాంగ్జీలో రెస్టారెంట్ భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 29 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 28 మంది గాయపడ్డారు. వీరిలో మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. లిన్‌ఫెన్ నగరంలో శనివారం చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ఇప్పటి వరకూ 29 మంది మృతిచెందినట్టు అధికారులు వెల్లడించారు. వందలాది మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఆదివారం ఉదయానికి సహాయక చర్యలు పూర్తయినట్టు పేర్కొన్నారు. శిథిలాల కింద చిక్కుకున్న 57 మందిని బయటకు తీశారు. వీరంతా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై కేసు నమోదుచేసిన అధికారులు దర్యాప్తు కొనసాగుతుందని అధికారులు వివరించారు. సహాయక చర్యల్లో మొత్తం 700 మంది సిబ్బంది పాల్గొన్నారు. ఈ ఘటనలో ఓ 80 ఏళ్ల మహిళ సురక్షితంగా బయటపడింది. చైనాలో భవనం కూలిపోవడం, ఘోరమైన నిర్మాణ ప్రమాదాలు సంభవించడం కొత్తేం కాదు. వేగవంతమైన అభివృద్ధిలో భాగంగా భద్రతా నియమాలను విస్తృతంగా ఉల్లంఘించడంతో తరుచూ ఇటువంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మార్చిలో కరోనా బాధితులను ఉంచిన ఓ భవనం కుప్పకూలిన ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. చైనాలోని ప్యూజిన్‌ ఫ్రావిన్స్‌ క్వాన్‌జౌ నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 80 గదులున్న ఓ రెండంతస్తుల హోటల్‌ భవనం ఒక్కసారిగా కూలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మొత్తం 40 మంది గాయపడినట్టు అధికారులు ప్రకటించారు.


By August 30, 2020 at 10:31AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/death-toll-rises-to-29-in-restaurant-collapse-north-provinces-citly-linef-in-china/articleshow/77830950.cms

No comments