Breaking News

ఢిల్లీ మర్కజ్ భవన్‌లో 1,200 మంది.. వీరిలో 200 మందికి కరోనా పాజిటివ్?


దేశ రాజధాని ఢిల్లీలోని హజరత్ నిజాముద్దీన్‌ ప్రాంతంలో అలజడి కొనసాగుతోంది. నిజాముద్దీన్‌లోని మర్కజ్ భవనం నుంచి బాధితులను ఆస్పత్రికి తరలిస్తున్నారు. సోమవారం నుంచి ఇప్పటి వరకు కరోనా వైరస్‌ అనుమానంతో 860 మందిని ఢిల్లీలోని వివిధ ఆస్పత్రులకు తరలించారు. మరో 300 మందికిపైగా ఈ భవనంలో ఉన్నట్లు గుర్తించిన అధికారులు.. వారిని తరలించే ప్రయత్నంలో ఉన్నారు. మర్కజ్ భవనంలో ఉన్న వ్యక్తుల్లో చాలా మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఆస్పత్రికి తరలించిన వారిలో పలువురికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. వీరి సంఖ్య 200 వరకు ఉన్నట్టు తెలుస్తోంది. మార్చి 1 నుంచి 15 వరకు మర్కజ్ భవనంలో జరిగిన మతప్రార్ధనలకు హాజరైన ఇతర రాష్ట్రాలకు చెందిన వారిలో 10మంది కరోనా వైరస్‌తో మృతి చెందారు. ఈ మత ప్రార్థనల్లో దాదాపు 2,500 మంది పాల్గొన్నట్టు భావిస్తున్నారు. లాక్ డౌన్ విధించిన తర్వాత మర్కజ్ భవనంలోనే 1200 మంది వరకు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. లాక్ డౌన్ తర్వాత కూడా పెద్ద సంఖ్యలో ఒకే చోట ఉండటంపై చర్యలు తీసుకోవాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు ఈనెల 24న నోటీసు ఇచ్చారని... స్వస్థలాలకు వెళ్లేందుకు వాహనాలు లేకపోవడంతో అంతా ఇక్కడే ఉన్నారని మర్కజ్ అధికార ప్రతినిధి తెలిపారు. అంతకు ముందు రోజే 1,500 మంది స్వస్థలాలకు వెళ్లిపోయినట్టు తెలియజేశాడు. ఇక్కడ చిక్కుకున్నవారిని స్వస్థలాలకు తరలించేందుకు 17 వాహనాలకు అనుమతి కోరుతూ పాస్‌ల కోసం దరఖాస్తు చేసినా, ఇంత వరకూ ఆదేశాలు రాలేదని వివరించాడు. కేసుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందని ఢిల్లీ ప్రభుత్వం భావిస్తోంది. జవహర్ లాల్ నెహ్రూ స్టేడియాన్ని క్వారంటైన్ కేంద్రంగా మార్చేందుకు సిద్ధమయ్యారు. మర్కజ్ భవన్‌లో రెండు వారాల పాటు నిర్వహించిన మత ప్రార్థనలకు ఇండోనేషియా, మలేషియా సహా దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 2,000 మంది ప్రతినిధులు హాజరయ్యారని అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రార్థనలకు తెలంగాణ నుంచి హాజరైనవారిలో ఆరుగురు కరోనా వైరస్‌తో మృతి చెందారు.


By March 31, 2020 at 12:03PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/around-1000-people-were-stuck-at-nizamuddin-markaz-more-than-200-people-developed-symptoms/articleshow/74907667.cms

No comments