Breaking News

ఈ యంగ్‌ హీరో సరసన ‘అర్జున్‌రెడ్డి’ బ్యూటీ!


తెలుగులో వచ్చిన మోడ్రన్‌ క్లాసిక్‌ చిత్రంగా సంచలన విజయం సాధించిన ‘అర్జున్‌రెడ్డి’ని చెప్పుకోవచ్చు. ఈ చిత్రం చూసిన వారికి అర్జున్‌రెడ్డిగా విజయ్‌ దేవరకొండ ఎలా గుర్తుండిపోతాడో ‘ప్రీతి’గా షాలినిపాండే కూడా అంతగా మెప్పించింది. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో పెరిగిన షాలిని పాండే ఆ తర్వాత తెలుగులో ‘మహానటి’తో పాటు ఇటీవల వచ్చిన కళ్యాణ్‌రామ్‌ హిట్‌ మూవీ ‘118’లో కూడా నటించింది. కానీ విజయ దేవరకొండతో పోలిస్తే అంత క్రేజ్‌, అవకాశాలు షాలిని పాండేకి రాలేదనే చెప్పాలి. 

ప్రస్తుతం ఆమె తమిళంలో కూడా తెలుగులో వచ్చిన ‘100%లవ్‌’ రీమేక్‌లో తమన్నా పోషించిన ‘మహాలక్ష్మి’ పాత్రను చేస్తోంది. మరో వైపు ‘ఉయ్యాల జంపాలా, సినిమా చూపిస్తా మావా, కుమారి 21 ఎఫ్‌, ఈడో రకం ఆడో రకం’ వంటి హిట్‌ చిత్రాలలో నటించిన రాజ్‌తరుణ్‌ ‘అంధగాడు, కిట్టు ఉన్నాడు జాగ్రత్త, రంగుల రాట్నం, రాజుగాడు’తో పాటు దిల్‌రాజు ‘లవర్‌’తో కూడా మెప్పించలేకపోయాడు. అయితే ఇప్పుడు మరలా దిల్‌రాజు రాజ్‌తరుణ్‌తో ‘ఇద్దరి లోకం ఒకటే’ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం విషయంలో దిల్‌రాజు కళ్లు షాలినిపాండే మీద పడ్డాయట. దాంతో ఇందులో రాజ్‌తరుణ్‌ పక్కన జోడీగా ఆమెని ఎంపిక చేశాడని సమాచారం. 

ఈ చిత్రం ద్వారా జిఆర్‌కృష్ణ దర్శకునిగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రం షూటింగ్‌ ఈనెల 16 నుంచి ప్రారంభం కానుందని సమాచారం. రాజ్‌తరుణ్‌, షాలిని పాండేలకి సంబంధించిన విషయం ఆరోజు అధికారికంగా ప్రకటించనున్నారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోయిన్‌ పాత్రకి కూడా ఎంతో ప్రాముఖ్యం ఉందని తెలుస్తోంది. ‘అర్జున్‌రెడ్డి’ తర్వాత ఆ స్థాయి సినిమాలలో ఆమెకి అవకాశాలు రాలేదు. వచ్చినా అవి విజయం సాధించలేదు. దాంతో దిల్‌రాజు సినిమా మీద ఆమె ఎన్నో ఆశలు పెట్టుకుందనే చెప్పాలి.



By May 06, 2019 at 04:36AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/45813/shalini-pandey.html

No comments